సీపీఎస్‌ను రద్దు చేయండి

సీపీఎస్‌ను రద్దు చేయండి– ఆదాయపు పన్ను పరిమితిని పెంచండి
– కేంద్ర ఆర్థిక మంత్రికి టీఎన్జీవో, టీజీవో వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌)ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)ను పునరుద్ధరించాలని టీఎన్జీవో, టీజీవో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. ఆదాయపు పన్ను పరిమితిని రూ.రెండున్నర లక్షల నుంచి రూ.పది లక్షలకు పెంచాలని కోరాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కె నిర్మలాసీతారామన్‌ను శుక్రవారం టీఎన్జీవో, టీజీవో అధ్యక్షులు మారం జగదీశ్వర్‌, ఏటూరి శ్రీనివాసరావు నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం ఉన్న పన్ను విధానంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్లు దాదాపుగా మూడు నెలల వేతనాన్ని ఆదాయపన్ను పరిధి కింద కోల్పోతున్నారని తెలిపారు. మెడికల్‌ ఖర్చులు, విద్య మీద పెట్టే ఖర్చులు పెరుగుతున్న సందర్భంగా అదనంగా రూ.ఏడున్నర లక్షలకు ఆదాయపు పన్ను పరిమితిని పెంచాలని పేర్కొన్నారు. సేవింగ్‌ పరిమితిని రూ.ఒకటిన్నర లక్షల నుంచి రూ.నాలుగు లక్షలకు పెంచాలని కోరారు. హౌసింగ్‌ రుణాల మీద వడ్డీని రూ.4.50 లక్షలకు పెంచాలని సూచించారు. మెడికల్‌ ఇన్సూరెన్స్‌కు సంబంధించి రూ.25 వేల పరిమితిని రూ.50 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశాల పట్ల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ సానుకూలంగా స్పందించారని తెలిపారు. సీపీఎస్‌ రద్దు విషయంలో కేంద్రం పరిధిలో ఒక కమిటీని వేశామనీ, ఆ నివేదిక వచ్చిన తర్వాత అందులోని అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించి తప్పకుండా సీపీఎస్‌ను రద్దు చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఆదాయపన్ను పరిధి పరిమితి విషయంలో తప్పకుండా మోడీ ప్రభుత్వం వేతన జీవులను ఆదుకునే పద్ధతిలో అతి త్వరలో కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఈ విషయంలో ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం రాకుండా ఉండేటట్టు కేంద్ర ఆర్థిక శాఖ పక్షాన తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల ముత్యాల సత్యనారాయణగౌడ్‌, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్‌, టీజీవో నాయకులు రామారావు, నరహరి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love