ఏటా పెరుగుతున్న కేసులు
ముందస్తు గుర్తింపే ముప్పునకు
చెక్ : వైద్యులు
నేడు వరల్డ్ కిడ్నీ క్యాన్సర్ డే
నవతెలంగాణ-సిటీబ్యూరో
మారిన జీవనశైలి, ధూమపానం, ఊబకాయం, అధిక రక్తపోటు వంటి కారణాలతో ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కిడ్నీలు.. ఉండేవి పిడికెడంతే అయినా.. చేసే పనులు మహా గొప్పవి. నిరంతరం రక్తాన్ని శుద్ధి చేస్తూ శరీరంలోని వ్యర్థాలు, విషపదార్థాలను మూత్రం రూపంలో బయటకు పంపించే అద్భుతమైన ఫిల్టర్లు కిడ్నీలు. ఒక్కో కిడ్నీలో సుమారు 10 లక్షల నెఫ్రాన్లు అనే వడపోత విభాగాలు ఉంటాయి. రోజూ సుమారు 180 లీటర్ల రక్తాన్ని వడపోసి, శరీర జీవక్రియలను సమతుల్యంగా ఉంచే బాధ్యత వీటిదే. నేడు ‘ప్రపంచ కిడ్నీ క్యాన్సర్ దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం.
పెరుగుతున్న ముప్పు!
ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ క్యాన్సర్ బాధితుల సంఖ్య ఏటా పెరుగుతోంది. గ్లోబోకాన్-2022 గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4.35 లక్షల మంది ఈ వ్యాధి బారినపడ్డారు. మన దేశంలో ప్రతి ఏటా సుమారు 18వేల కొత్త కేసులు నమోదవుతుండగా, 9వేల కంటే ఎక్కువ మంది ప్రాణం కోల్పోతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా కిడ్నీ క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ రోజుల్లో ఆధునిక స్కానింగ్ సాంకేతికతల వల్ల కిడ్నీ క్యాన్సర్‌ను ప్రారంభ దశల్లోనే గుర్తించడం సాధ్యమవుతోంది. అల్ట్రాసౌండ్, కాంట్రాస్ట్-ఎన్‌హ్యాన్స్‌డ్ సిటీ స్కాన్, పరీక్షల ద్వారా కిడ్నీలోని చిన్న గడ్డలను సైతం ఖచ్చితంగా గుర్తించొచ్చు. క్యాన్సర్ కిడ్నీ దాటి ఇతర భాగాలకు పాకినట్టు అనుమానం ఉన్నా, లేదా నిరూపణలో స్పష్టత లేకపోయినా బయాప్సీ లేదా పెట్-సిటీ స్కాన్ వంటి పరీక్షలు చేస్తారు.క్యాన్సర్ కిడ్నీకే పరిమితమైతే ఆపరేషనే ప్రధాన చికిత్స. ఇందులో క్యాన్సర్ ఉన్న భాగాన్ని మాత్రమే తొలగించడం లేదా అవసరాన్ని బట్టి కిడ్నీ మొత్తాన్ని తొలగిస్తారు. ప్రస్తుతం లాపరోస్కోపిక్, రోబోటిక్ పద్ధతుల్లో సులువైన సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి.
కిడ్నీలోనే ఆరంభం..
కిడ్నీల్లో ఉండే అతి చిన్న వడపోత నాళాల లోపలి పొరల్లోని కణాలు నియంత్రణ లేకుండా అసాధారణంగా పెరిగి, కణితిగా మారినప్పుడు క్యాన్సర్‌గా ఏర్పడుతుంది. సాధారణంగా ఇది ఒక కిడ్నీలోనే వస్తుంది. కానీ, అరుదైన సందర్భాల్లో రెండు కిడ్నీలకూ విస్తరించే ప్రమాదం ఉంది. వ్యాధి ముదిరిన తర్వాతే కిడ్నీ క్యాన్సర్ లక్షణాలు బయటపడే అవకాశం ఎక్కువ ఉండటంతో
మూత్రంలో రక్తం కనిపించడం,
నడుము లేదా పక్క భాగంలో నిరంతర నొప్పి,
పొత్తికడుపులో గడ్డలా అనిపించడం,
కారణం లేకుండా బరువు తగ్గడం,
తీవ్ర అలసట, బలహీనత,
తరచూ జ్వరం రావడం లాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు.
సకాలంలో వైద్య పరీక్షలు తప్పనిసరి
డాక్టర్ జి.వాసుబాబు, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, హెమట-ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ , రెనోవా సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్
ప్రధానంగా 50 ఏండ్లు పైబడిన వారికి
ధూమపానం
ఊబకాయం
అధిక రక్తపోటు, మధుమేహం
కుటుంబంలో కిడ్నీ క్యాన్సర్ చరిత్ర ఉన్నవారికి కొన్నిరకాల పరిశ్రమల రసాయనాలకు ఎక్కువకాలం గురైన వారికి ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఎంత అప్రమత్తంగా ఉండి, వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే, ప్రాణాన్ని కాపాడుకునే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. లక్షణాలపై అవగాహన పెంచుకుందాం. సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం.
కిడ్నీపై క్యాన్సర్ పంజా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



