జూన్‌ రెండున కార్నివాల్‌

జూన్‌ రెండున కార్నివాల్‌– అన్ని కళారూపాలతో పెద్ద ఎత్తున ప్రదర్శనలు
– ఏర్పాట్లపై సీఎస్‌ సమీక్ష
– ఐదు వేల మంది పోలీసులతో బ్యాండ్‌ ప్రదర్శన
– ట్యాంక్‌బండ్‌పై 80 స్టాళ్ల ఏర్పాటు
– ఘనంగా రాష్ట్రావతరణ వేడుకలు
– పరేడ్‌ మైదానంలో రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించనున్న సీఎం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా జూన్‌ రెండున హైదరాబాద్‌ లోని ట్యాంక్‌బండ్‌పై రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అన్ని రకాల కళారూపా లతో పెద్ద ఎత్తున కార్నివాల్‌ను నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. అదే రోజు శిక్షణ పొందిన ఐదు వేల మంది పోలీసు అధికారులు బ్యాండ్‌ ప్రదర్శనలో పాల్గొంటారని ఆమె తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై దాదాపు 80 రకాల స్టాళ్లను ఏర్పాటు చేస్తామని వివరించారు. హస్త కళలు, చేనేత, స్వయం సహాయక బృందాలు తయారు చేసిన వస్తువులతోపాటు నగరంలో పేరొందిన హోటళ్ల ద్వారా ఫుడ్‌ స్టాళ్లను కూడా ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రావతరణ దినోత్సవ ఏర్పాట్లపై సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎస్‌ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జూన్‌ రెండున ఉదయం గన్‌పార్కులోని అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళులర్పిస్తారని చెప్పారు. అనంతరం సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని వివరించారు. ఆ సందర్భంగా సీఎం…రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించి, ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. అదేరోజు రాత్రి ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే వేడుకలకు హాజరయ్యే పౌరులు, పిల్లల కోసం పలు క్రీడలతో కూడిన వినోదశాలను కూడా ఏర్పాటు చేస్తామని ఆమె పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం ఆకర్షణీయమైన బాణాసంచా ప్రదర్శనతోపాటు లేజర్‌ షో కూడా ఉంటుందని వెల్లడించారు. వీటిని తిలకించేందుకు విచ్చేసే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలంటూ సీఎస్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రావతరణ ఉత్సవాల సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించాలని సూచించారు. సమీక్షా సమావేశంలో డీజీపీ రవిగుప్తా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు దాన కిశోర్‌, శైలజా రామయ్యార్‌, శ్రీనివాసరాజు, సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love