పైప్ లైన్లు ధ్వసం చేస్తే కేసులు నమోదు చేయాలి: కలెక్టర్

– ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులను ఆదేశించిన భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేస్ మిశ్రా
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రజా ఆస్థులైన మంచినీటి పైపులైన్లు ధ్వంసం చేసినా,దుర్వినియోగం చేసినా పోలీస్ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆర్ డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడిఓసి కార్యాలయంలో మల్హర్ మండలంలో లంబాడీ తండా, అన్సార్ పల్లి, నాచారం, రుద్రారం గ్రామాల్లో పర్యటించి మంచినీటి సరఫరా ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశంపై ఐడివఓసి కార్యాలయంలో ఆర్ డబ్ల్యూఎస్ ఈ ఈ నిర్మలతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రిటికల్ గ్రామాలను గుర్తించి మంచినీటి సమస్య రాకుండా పకడ్బందీ కార్యాచరణ తయారు చేయాలని ఆదేశించారు.  అక్రమంగా నీటిని వినియోగిస్తే పోలీస్ కేస్ నమోదులు చేయాలన్నారు. చివరి పాయింట్ వరకు మిషన్ భగీరథ  నీరు చేరాలని ఆయన పేర్కొన్నారు. మంచినీరు అందక  ప్రజలు  దాహంతో  ఇబ్బంది పడకూడదని, ప్రజల సమస్యను పరిష్కరించాలన్నారు. నిధుల కొరత లేదని, నిర్లక్ష్యం వహిస్తే షోకాజ్ జారీతో పాటు సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.  వచ్చే వారం నుండి గ్రామాల్లో  క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేస్తానని నీటి సమస్య పరిష్కారంలో అలసత్వం వహిస్తున్నట్లుగా గుర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. సమస్య ఉంటే పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, పట్టనట్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన సంబంధిత అధికారులను హెచ్చరించారు.
Spread the love