– టెండర్ల పంపిణీలో పదేండ్లుగా జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలి :టీఎంఎంకేఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎండిన చెరువులు, కుంటల లీజులను రద్దు చేయాలని తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం(టీఎంఎంకేఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహా అధ్యక్షతన గెట్టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాల కృష్ణ మాట్లాడుతూ కరువు ప్రభావంతో రాష్ట్రంలో చెరువులు, కుంటలు ఎండిపోయాయని తెలిపారు. దీంతో మత్స్య పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్య కారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ ఏడాది చేప, రోయ్యపిల్లల పంపిణీ టెండర్ల విధానం కాకుండా మత్స్య సోసైటీల ఖాతాల్లో నగదు జమచేయాలని విజ్ఞప్తి చేశారు. పదేండ్ల నుంచి చేపల, రొయ్యల పంపీణీ టెండర్లలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యపరిశ్రమ అభివృద్ధి మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిని నియమించాలని కోరారు. సుమారు పది లక్షల మత్స్యకార కుటుంబాలు ఈవృత్తిపై ఆధారపడి ఉపాధి పొందుతున్నాయని తెలిపారు. దాదాపు 5,500 ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 4.20లక్షల మంది సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వమైనా వారి అభివృద్ధికి తగిన కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువులు, కుంటలను కబ్జా చేస్తున్నారని, మరో పక్క పారిశ్రామిక అభివృద్ధి పేరుతో పట్టణాల్లో రసాయనాలను డ్రైనేజీని చెరువులు, కుంటల్లోకి వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మత్స్య సంపద అంతరించిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాలకు గురైన చెరువులు, కుంటలు, జలవనరులను గుర్తించి కాపాడాలని డిమాండ్ చేశారు. పదేండ్లలో మత్య్స శాఖలో ఎన్సీడీసీ నుంచి తెచ్చిన రూ. వెయ్యి కోట్ల రుణాలు, సంక్షేమ పథకాల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వృత్తి ప్రమాదంలో చనిపోయిన వారికి ఎక్స్రేషియో, ఇన్సూరెన్స్ అందక ఆయా కుటుంబాలు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నాయని తెలిపారు. ఆ కుటుంబాలను అదుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాల మత్స్య సహకార సంఘాల సమాఖ్య ఎన్నికలు జరిపి రాష్ట్ర పెడరేషన్కు కూడా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీిహెచ్ వెంకన్న, మామిళ్ల జగదీష్ పాల్గొన్నారు.