కుల గణన చేయాలి

కుల గణన చేయాలి– స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలి : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్‌ కృష్ణయ్య,
– బీఆర్‌ఎస్‌ నాయకులు ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

– ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద మహాధర్నా
నవతెలంగాణ – ముషీరాబాద్‌
కాంగ్రెస్‌ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ ప్రకారం సమగ్ర కుల గణన చేసి స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్య, బీఆర్‌ఎస్‌ నాయకులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. శనివారం బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్‌ అధ్యక్షతన హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వైఖరిపై అనుమానం ఉంద న్నారు. పాత పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కుట్ర జరుగుతోందని తెలిపారు. ఓటర్ల ప్రకారం కాకుండా జనాభా ప్రతిపాదికన బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డిని బీసీలు నమ్మితే.. బిచ్చగాళ్లను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లోనూ తమను అణగదొక్కుతూ బీసీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని, లేని పక్షంలో తీవ్రస్థాయిలో వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. బీసీల హక్కుల కోసం రాష్ట్రంలో అన్ని పార్టీలు కలిసి రావాలని కోరారు.
ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. దేశంలో బీసీల పరిస్థితి ఇంత దారుణంగా ఉండటానికి కారణం కాంగ్రెస్‌ అని విమర్శించారు. కాంగ్రెస్‌కు బీసీ జనాభా గణన చేయాలనే ఆలోచన లేదని, ప్రశ్నలు అడిగిన ప్రతి ఒక్కరినీ సీఎం రేవంత్‌రెడ్డి అరెస్టు చేయిస్తున్నారని ఆరోపించారు. సమాజంలో 99 శాతంగా ఉన్న బీసీ, ఎస్టీ, ఎస్సీలు ప్రతిరోజూ ధర్నాలు చేస్తూ బతకాల్సింది వస్తోందన్నారు. జైల్లో ఉండేది కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలేనన్నారు. సుప్రీంకోర్టులోనూ 79 శాతం అగ్ర వర్ణాల వారే జడ్జీలుగా ఉన్నారని తెలిపారు. అలాంటప్పుడు బీసీలకు అనుకూలంగా ఎలా తీర్పు వస్తుందని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల గారడీ లాగానే కామారెడ్డి డిక్లరేషన్‌ కూడా ఉంటుందని, కావునా బీసీల రిజర్వేషన్లకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహా ధర్నాలో జూలూరి గౌరీశంకర్‌, మాజీ ఎంపీ ఆనంద్‌ భాస్కర్‌, ఎంబీసీ వ్యవస్థాపకుడు, బీసీ టైమ్స్‌ సంపాదకులు సంగెం సూర్యారావు, ఆల్‌ ఇండియా ఓబీసీ జేఏసీ చైర్మెన్‌ సాయిని నరేందర్‌, హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడు బత్తుల సిద్ధేశ్వర్‌, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమణకుమార్‌, టి.జర్నలిస్టుల ఫోరమ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల క్రిష్ణ, గిరిజన రిజర్వేషన్‌ సాధన సమితి చైర్మెన్‌ సంజీవ్‌ నాయక్‌, మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు పుట్టం పురుషోత్తం పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love