ఆనవాళ్లు కోల్పోతున్న సీసీఐ

– పున్ణప్రారంభంపై పట్టింపేదీ..?: గత ఎన్నికల్లో హామీనిచ్చిన బీజేపీ
– ఐదేండ్లు గడిచినా తెరుచుకోని వైనం
– మళ్లీ నోరెత్తని కాషాయ నేతలుొ పరిశ్రమ మూతతో వేలాది మందికి ఉపాధి దూరం
– తాజాగా.. గెలిపిస్తే ప్రారంభిస్తామని కాంగ్రెస్‌ హామీ
ఆదిలాబాద్‌ ప్రాంత వాసులకు కల్పతరువుగా ఉన్న సీసీఐ పరిశ్రమ ఆనవాళ్లు కోల్పోతోంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం.. పట్టింపులేమి కారణంగా పరిశ్రమ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. మూతపడి ఏండ్లు గడుస్తున్నా.. తెరిపించేందుకు ఎలాంటి ప్రయత్నాలూ జరగడం లేదు. గెలిపిస్తే పరిశ్రమను తెరిపిస్తామని 2019 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులు ఇచ్చిన హామీ నెరవేరలేదు. పైగా తుక్కు కింద విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఈ ఎన్నికల్లో మొత్తానికే ఆ అంశాన్నే ఆ పార్టీ విస్మరించింది. ఇక పరిశ్రమ పునరుద్ధరణ అంశం కలగానే మారుతుందనే ఆందోళన ఈ ప్రాంత వాసుల్లో వ్యక్తమవుతోంది. అయితే, కాంగ్రెస్‌ మాత్రం తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే పరిశ్రమను తెరిపించేందుకు కృషి చేస్తామని భరోసానిస్తోంది.
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఆదిలాబాద్‌ ప్రాంతవాసులకు ఉపాధి కల్పించిన సిమెంటు కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) మూతపడి 20ఏండ్లకు పైబడి అవుతోంది. దాన్ని తెరిపించడంపై ప్రభుత్వాలు దృష్టిసారించడం లేదు. 1984 ప్రారంభమై 1998 వరకు 14ఏండ్లపాటు నిర్విరామంగా సిమెంటు ఉత్పత్తి చేసిన ఈ పరిశ్రమ అర్ధాంతరంగా మూతపడింది. పరిశ్రమ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో ఆనవాళ్లు కోల్పోయే పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఏడాది కిందట పరిశ్రమను తుక్కు కింద విక్రయించేందుకు కేంద్రం టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాకపోవడంతో అదీ నిలిచిపోయింది. ముఖ్యంగా 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఈ పరిశ్రమను తెరిపిస్తామని హామీనిచ్చి బీజేపీ ఆదిలాబాద్‌లో తొలిసారి విజయం సాధించింది. గెలిచిన తర్వాత ఆ పార్టీ ఎంపీ పరిశ్రమ పునరుద్ధరణ విషయమై ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. ఈ పరిశ్రమను తెరిపించాలని సీపీఐ(ఎం) కొన్నేండ్లుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతోంది. ఏడాది కిందట పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి.రాఘవులు, సీపీఐ(ం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వేర్వేరుగా ఆదిలాబాద్‌కు వచ్చి పరిశ్రమను సందర్శించారు. తుక్కు కింద విక్రయించొద్దని, పరిశ్రమను తెరిపించి ఈ ప్రాంత వాసులకు ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ సైతం పట్టణ బంద్‌ వంటి కార్యక్రమాలు నిర్వహించి సీసీఐ పునరుద్ధరించాలని డిమాండ్‌ చేసింది. పరిశ్రమను తెరిపించాలనే డిమాండ్లు ప్రజల నుంచీ వెల్లువెత్తుతున్నాయి.
తెరిపిస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్‌
సీసీఐ పరిశ్రమలో సుమారు 700మందికి ప్రత్యక్షంగా.. మరో 1500మందికి పరోక్షంగా ఉపాధి కల్పించేది. తాజాగా ఈ పరిశ్రమను తెరిపిస్తామని కాంగ్రెస్‌ హామీనివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏప్రిల్‌ 22న ఆదిలాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి పరిశ్రమను తెరిపిస్తామని భరోసా ఇచ్చారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు పరిశ్రమ పట్ల నిర్లక్ష్యం వహించాయని, తాము తెరిపించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అవసరమైతే ప్రయివేటు వ్యక్తులతో మాట్లాడి తెరిపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోపక్క ఈ ఐదేండ్ల కాలంలో ఉమ్మడి జిల్లాలో కొత్త పరిశ్రమలు నెలకొల్పిన దాఖలాలు లేవు. దీంతో వేలాది మంది యువత ఉపాధి లభించక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సీసీఐని పునరుద్ధరిస్తే చాలా మందికి ఉపాధి లభించనుంది.

Spread the love