రేవంత్‌ క్యాబినెట్‌లో మైనార్టీ మంత్రి ఏరి?

– కేసీఆర్‌ క్యాబినెట్‌లో డిప్యూటీ సీఎం, హోంమినిస్టర్‌ ఇచ్చాం.. ముస్లిం మైనార్టీల సమావేశంలో హరీశ్‌రావు : బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి
నవతెలంగాణ-సిద్దిపేట
రేవంత్‌ రెడ్డి క్యాబినెట్‌లో ఒక్క మైనార్టీ మంత్రి లేడని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలోని కొండా భూదేవి గార్డెన్స్‌లో గురువారం జరిగిన ముస్లిం మైనార్టీల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. కేసీఆర్‌ క్యాబినెట్‌లో డిప్యూటీ సీఎం, హౌమ్‌ మినిస్టర్‌ పదవి మైనార్టీ నేతలకు ఇచ్చామన్నారు. సచార్‌ కమిటీని కాంగ్రెస్‌ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కెేసీఆర్‌ షాదీ ముబారక్‌ కింద రూ. లక్ష ఇస్తే, రేవంత్‌ రెడ్డి తులం బంగారం అదనంగా ఇస్తామని హామీ ఇచ్చారు.. కానీ తులం బంగారం పోయింది.. లక్ష రూపాయలూ పోయాయి అని అన్నారు. మీ పిల్లలు ఇతర దేశాలలో చదువుకోవడానికి కెేసీఆర్‌ 3000 మందికి రూ.20 లక్షలు ఇచ్చారని తెలిపారు. కేసీఆర్‌ ఒక సెక్యులర్‌ లీడర్‌ అని అన్నారు. హిందూ, ముస్లింలు రెండు కండ్లలా పని చేస్తున్నామని, బీజేపీతో, బీఆర్‌ఎస్‌ పోరాట ఫలితంగా కేసీఆర్‌ కూతురు జైలుకు వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీతో బీఆర్‌ఎస్‌ కలిసి ఉంటే కవిత అరెస్టు అయ్యేవారా అని ప్రశ్నించారు. నాలుగు నెలలు గడిచినా కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.4 వేల పెన్షన్‌ ఇవ్వడం లేదని, రైతులకు బోనస్‌ ఇవ్వడం లేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి బీజేపీతో కలిసి బీఆర్‌ఎస్‌ను లేకుండా చేయాలని చూస్తున్నారని, కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని అన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి చదువుకున్న వ్యక్తి, ఐఏఎస్‌ అధికారి, ప్రజలకు మంచి సేవ చేసే వ్యక్తి అని, ఆయనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సిద్దిపేటలో ఎంపీ, ఎమ్మెల్యే ఒకే పార్టీ వ్యక్తులు ఉంటే ప్రజలకు మరింత సేవ చేయగలుగుతామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారుక్‌ హుస్సేన్‌, నాయకులు వజిరుద్దీన్‌, మోయిజ్‌, ఫక్రుద్దీన్‌, అత్తర్‌ పటేల్‌, బాబ్‌ జాని, అక్బర్‌ నవాబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love