మళ్లీ తప్పుడు సమాచారం

– ఈసీఐ నుంచి నోటీసు
– సోషల్‌ మీడియా పోస్ట్‌ను తొలగించిన కర్నాటక బీజేపీ
న్యూఢిల్లీ: తప్పుడు వార్తలు, కథనాలు, సమాచారంతో ప్రజలను వర్గాలుగా విభజించి రాజకీయాలు చేయటం ఈ ఎన్నికల్లో బీజేపీ చేస్తున్న పని. ఒక అజెండా అంటూ లేకుండా కేవలం విషం చిమ్మే ప్రచారాన్ని మాత్రమే ఆ పార్టీ నమ్ముకున్నది. ముఖ్యంగా, ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకుంటూ.. ప్రజలను తప్పుదారి పట్టించే వివాదాస్పద వీడియోలను తయారు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నది. ఇప్పటికే ఇలాంటి వీడియోలు, ఫోటోలు, కథనాలను ఆ పార్టీ తన సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేసి విమర్శల పాలైంది. అయినప్ప టికీ.. ఆ పార్టీ తీరులో మాత్రం ఎలాంటి మార్పూ కనిపించటం లేదు. ఒక మైనారిటీ వర్గాన్ని టార్గెట్‌ చేసుకుంటూ తప్పుదారి పట్టించే, వివాదాస్పద పోస్ట్‌పై ఎన్నికల సంఘం (ఈసీఐ) నుంచి నోటీసులు రావటంతో.. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలోని దాని అధికారిక ఖాతాల నుంచి బీజేపీ కర్నాటక యూనిట్‌ ఒక వీడియోను తొలగించాల్సి వచ్చింది. కర్నాటకలో సిద్ధరామయ్య నేతృత్వం లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆలయ కమిటీకి సభ్యుల నియామకంపై బీజేపీ చేసిన తప్పుడు సమాచారాన్ని లేవనెత్తిన తర్వాత బీజేపీ సోషల్‌ మీడియా ఖాతాల నుంచి పోస్ట్‌ తొలగించబడటం గమనార్హం. హొసాకోట్‌లోని అవిముక్తేశ్వర స్వామి దేవాలయంలోని బ్రహ్మరథోత్సవ (రథోత్సవం) కమిటీలో ముస్లిం వర్గానికి చెందిన సభ్యుడిని నియమించటాన్ని అభ్యంతరం వ్యక్తం చేసిన కర్నాటక బీజేపీ.. రాష్ట్రంలోని సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం హిందువులను దోచుకుని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించింది.
దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రి రామలింగారెడ్డి కర్నాటక బీజేపీని నిలదీశారు. రథోత్సవ కమిటీలో ముస్లిం వర్గానికి చెందిన సభ్యుడిని నియమించటం కొన్నేండ్లుగా అనుసరిస్తున్న ఆచారమనీ, రాష్ట్రంలో బీజేపీ హయాంలోనూ అమలు చేశారని వారు గుర్తు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు 2020, 2021లో కూడా హిందూయేతరుడిని ప్యానెల్‌లో నియమించారని మంత్రి వివరించారు. అప్పటి మంత్రి ఎం.టి.బి నాగరాజ్‌ సూచన మేరకే నియామకాలు జరిగాయని తెలిపారు. ”హౌసాకోట్‌లోని శ్రీ అవిముక్తేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మౌత్సవం కార్యక్రమాన్ని పర్యవేక్షించ డానికి కాంగ్రెస్‌ ‘నవాజ్‌’ని నియమిం చింది. మన దేవాలయాలను దోచుకోవ టానికి ప్రయత్నించిన తర్వాత, హిందు వులను ద్వేషించే సీఎం సిద్ధ రామయ్య ఇప్పుడు హిందువేతరులను నియమిం చడం ద్వారా దేవాలయాలను, వాటి వనరులను నియంత్రించాలని చూస్తు న్నారు” అని బీజేపీ కర్నాటక యూనిట్‌ తన సోషల్‌ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నది.
కర్నాటక బీజేపీ తన అధికారిక హ్యాండిల్‌లో ఈ తప్పుదోవ పట్టించే పోస్ట్‌ను పెట్టిన తర్వాత, మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సి.టి రవితో సహా పలువురు బీజేపీ నాయకులు తమ అధికారిక ఖాతాలలో పోస్ట్‌లను పంచు కున్నారు. కాగా, ఈ తప్పుడు సమాచారంపై ఈసీఐ నోటీసు అందించిన తర్వాత.. కర్నాటక బీజేపీ తన అన్ని అధికారిక సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ నుంచి ముస్లింలను లక్ష్యంగా చేసుకున్న పోస్ట్‌ను తీసివేసింది.

Spread the love