అత్యుత్తమ చికిత్స కోసం సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్సీ

– రాష్ట్రంలోని 18 ఎస్‌ఎన్‌సీయూలకు అనుసంధానం : మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-మెహిదీపట్నం
అనుభవజ్ఞులైన వైద్యులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అత్యుత్తమ చికిత్స అందించడమే సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్సీ ఉద్దేశం అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. హైదరాబాద్‌ రెడ్‌ హిల్స్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రిలో శనివారం సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్సీని మంత్రి ప్రారంభించారు. సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్సీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 44 ఎస్‌ఎన్‌సీయూలలో 18 ఎస్‌ఎన్‌సీయూలను అనుసంధించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో విపత్కర పరిస్థితిలో ఉన్న పిల్లలకు నిలోఫర్‌ ఆస్పత్రిలోని అనుభవజ్ఞులైన వైద్యులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అత్యుత్తమ చికిత్స అందించడమే సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్సీ ఉద్దేశం అన్నారు. నెలలు నిండకుండగానే పుట్టిన పిల్లలు, ఏదైనా ఇన్‌ఫెక్షన్‌, అవయవాలు పూర్తిగా వృద్ధి చెందకుండానే పుట్టిన పిల్లలను అత్యవసర చికిత్స నిమిత్తం నిలోఫర్‌ ఆస్పత్రికి తీసుకొస్తుండగానే చాలామంది శిశువులు దారిలోనే మరణిస్తున్నారని చెప్పారు. ఇకపై సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్సీ కార్యక్రమం ద్వారా నీలోఫర్‌ ఆస్పత్రిలోని వైద్యులు వీడియోలో చూస్తూ ఆ పిల్లలు జన్మించిన ఆస్పత్రిలోని డాక్టర్ల ద్వారా వారికి ఉత్తమ చికిత్స అందిస్తారని తెలిపారు. దేశంలో ఇప్పటివరకు ఇలాంటి సౌకర్యం ప్రయివేటు ఆస్పత్రుల్లో మాత్రమే ఉందని తెలిపారు. ఒకప్పుడు ప్రయివేటు ఆస్పత్రుల్లో 90 శాతం డెలివరీలు అయితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 శాతం డెలివరీలు అయ్యావని.. ఇప్పుడు ప్రయివేటు ఆస్పత్రుల్లో 30 శాతం డెలివరీలు అయితే, 70 శాతం డెలివరీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైద్య ఆరోగ్య సేవలకు రూ.500 కోట్లు కేటాయించడం, కేసీఆర్‌ కేట్‌, ఆరోగ్య లక్ష్మి, వైద్య ఆరోగ్య సిబ్బంది నిరంతర శ్రమ వల్ల ఈ లక్ష్యాలను సాధించగలిగామని వివరించారు. వైద్య ఆరోగ్యశాఖ కమిష నర్‌ శ్వేత, డీఎమ్‌ఈ రమేష్‌రెడ్డిని అభినందించారు.
నిటి అయోగ్‌ ర్యాంకింగ్స్‌లో రాజస్థాన్‌ 16, ఛత్తీస్‌గఢ్‌ 10, హిమాచల్‌ ప్రదేశ్‌ 7, ఉత్తరప్రదేశ్‌ చిట్ట చివరి స్థానంలో ఉందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న మాతాశిశు మరణాల్లో 60శాతం పది దేశాల నుంచే అవుతుండగా, అందులో భారత్‌ అగ్రస్థానంలో ఉందని డబ్లూహెచ్‌ఓకు చెందిన యునిసెఫ్‌ ఇటీవల ప్రకటించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో నైజీరియా, పాకిస్థాన్‌, కాంగో, ఇథియోపియా, బంగ్లాదేశ్‌ వంటి దేశాలతో భారత్‌ పోటీ పడుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పరువు తీసిందన్నారు.
ఇన్నేండ్ల స్వతంత్రంలో తల్లీబిడ్డల ఆరోగ్యాలకు కూడా మన దేశంలో భరోసా ఇవ్వలేకపోతున్నాం.. ఇలాంటి అంశాల గురించి దేశ నాయకులు ఆలోచించాల్సింది పోయి రాజకీయాల గురించి మాట్లాడుతుండటం సిగ్గుచేటు అన్నారు. నడ్డాలు, పాండేలు, సుక్విందర్‌ సింగ్‌ సహా తెలంగాణకు వచ్చి నీతులు చెప్పే బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు ఆలోచించుకోవాలని.. తమ నుంచి నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌం మంత్రి మహమ్మద్‌ అలీ పాల్గొన్నారు.

Spread the love