కేంద్రమంత్రి అలా…రైల్వే ఇలా!

– ఎమ్‌ఎమ్‌టీఎస్‌కు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదన్న కిషన్‌రెడ్డి
– 10వ తేదీ వరకు సర్వీసులు రద్దు చేస్తూ ద.మ.రైల్వే ప్రకటన
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఎమ్‌ఎమ్‌టీఎస్‌ రెండో దశ నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదనీ, అందువల్ల కేంద్ర ప్రభుత్వమే వందశాతం నిధులతో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తుందని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి తెలిపారు. సరిగ్గా ఆయన ఈ ప్రకటన చేస్తున్న టైంలోనే మరోసారి 16 ఎమ్‌ఎమ్‌టీఎస్‌ రైళ్లను ఈనెల 10వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటన జారీ చేశారు. యాధృచ్ఛికమో…ఉద్దేశ్యపూర్వకమో తెలీదు కానీ, కేంద్ర మంత్రి ప్రకటనకూ, క్షేత్రస్థాయి పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదనే విషయం స్పష్టమైపోయింది. ‘ఎమ్‌ఎమ్‌టీఎస్‌కు మంగళం’ శీర్షికతో ఆగస్టు 28వ తేదీ నవతెలంగాణలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. తొలి దశ ఎమ్‌ఎమ్‌టీఎస్‌ సర్వీసుల్నే ఇష్టానుసారం రద్దు చేస్తున్నారంటూ పూర్తి ఆధారాలతో కథనాన్ని ప్రచురించింది. శనివారం కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి రాష్ట్రంలో అమలవుతున్న రైల్వే ప్రాజెక్టుల వివరాలతో విలేకరుల సమావేశం నిర్వహించారు. అయితే దీనిలో ఎమ్‌ఎమ్‌టీఎస్‌ సర్వీసుల్ని ఎందుకు రద్దు చేస్తున్నారనే వివరణ మాత్రం ఇవ్వలేదు. రైల్వే ప్రాజెక్టులు పూర్తయితే ప్రధాని నరేంద్రమోడీకి పేరొస్తుందనే ఉద్దేశ్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తున్నదని ఆరోపించారు. అవసరం లేని మార్గాల్లో వేల కోట్ల రూపాయల వ్యయంతో మెట్రోరైల్‌ నిర్మిస్తున్నారని విమర్శించారు. ఎంఎంటీఎస్‌ – ఫేజ్‌ 2లో ఘట్‌కేసర్‌ నుంచి యాదాద్రిని అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా ఆలోచిస్తున్నదనీ, కానీ దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస సహకారం అందడం లేదని చెప్పారు. రూ.980 కోట్ల అంచనా వ్యయంతో 40 కి.మీ., నిర్మితమయ్యే ఈ మార్గాన్ని వందశాతం నిధులు కేటాయించి కేంద్ర ప్రభుత్వమే పూర్తిచేయాలని నిశ్చయించిందని తెలిపారు. అలాగే ఘట్‌ కేసర్‌ నుంచి వంగపల్లి వరకు నాలుగు లైన్ల పనులు కూడా ఈ ప్రాజెక్టులో భాగంగానే జరుగుతాయని వివరణ ఇచ్చారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకూ రైల్వే కనెక్టివిటీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భూసేకరణ, నిధుల కేటాయింపులో రాష్ట్రమే ముందుకు రావట్లేదనీ, ఈ సహాయ నిరాకరణ వల్ల దాదాపు 700 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల పనులు నిలిచిపోయాయని చెప్పారు. రాష్ట్రంలో 40 రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు కేంద్రం రూ.2,300 కోట్ల నిధుల్ని విడదల చేసిందనీ, వీటిలో 21 స్టేషన్లకు ప్రధానమంత్రి వర్చువల్‌ మోడ్‌లో శంకుస్థాపన చేశారని వివరించారు. ప్రాజెక్టుల వారీగా ఆయా స్టేషన్లు, లైన్లు, నిధుల కేటాయింపు అంశాలను మరోసారి వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం రూ.83వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.
టైం ఛేంజ్‌
ఎమ్‌ఎమ్‌టీఎస్‌ 16 సర్వీసుల్ని ఈనెల 10వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే ఈనెల 4 నుంచి 10వ తేదీ వరకు ఉందానగర్‌-లింగంపల్లి (ట్రైన్‌ నెంబర్‌.47165) సర్వీసు టైం టేబుల్‌ను మారుస్తున్నట్టు ప్రకటించింది. ఉందానగర్‌లో ఉదయం 8.50కు బయల్దేరి, ఉదయం 10.50కి లింగంపల్లికి చేరుకుంటుందని తెలిపారు. మౌలిక వసతుల నిర్వహణ పనుల వల్ల ఎమ్‌ఎమ్‌టీఎస్‌ సర్వీసుల్ని రద్దు చేస్తున్నామని ఆ ప్రకటనలో వివరించారు.

Spread the love