– మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజాక్షేత్రంలో పోరు విత్తనాలు జల్లి ఉద్యమాలను ఉరకలెత్తించిన చైతన్యదీప్తి, పోరాటస్ఫూర్తి వట్టికోట ఆళ్వారుస్వామి అని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కొనియాడారు. శుక్రవారం వట్టికోట ఆళ్వార్‌స్వామి జయంతిని పురస్కరించుకుని తెలంగాణ సమాజానికి ఆయన అందించిన సేవలను మంత్రి స్మరించుకున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కలాన్ని ఖడ్గంగా ప్రయోగించి, అక్షరాలను పదునెక్కించి అణచివేతను, వివక్షను ఎదిరించి నిలిచిన ధీశాలి వట్టికోట అని కొనియాడారు. నిజాం వ్యతిరేక పోరాటం, గ్రంథాలయోద్యమం మొదలు స్వాతంత్రయోద్యమం వరకు ప్రతి పోరాటంలోనూ ఆయన అద్వితీయమైన పాత్ర పోషించారని గుర్తుచేశారు. సమాజ హితం కోసం రచయితగా, పాత్రికే యునిగా, పౌరహక్కుల నేతగా, గ్రంథాలయోద్యమాల నాయకుడిగా తన జీవిత సర్వస్వాన్ని అర్పించిన ధన్యజీవి అని కీర్తించారు. కార్మికునిగా జీవితం ప్రారంభించి, ప్రజల మనిషిగా చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న వట్టికోట ఆళ్వారుస్వామి నేటి యువతరానికి స్ఫూర్తిదాయకుడని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వట్టికోట బాటలో పయనిస్తూ, ప్రజల ఆకాంక్షలను గుర్తించి ఆ దిశగా నిబద్ధతతో పని చేస్తున్నదని మంత్రి స్పష్టం చేశారు.