చంద్రయాన్‌ కౌంట్‌డౌన్‌ షురూ..

– నేడు నింగిలోకి ఎల్వీఎం-3పీ4 రాకెట్‌
– విజయవంతమవుతుంది : ఇస్రో మాజీ చైర్మన్‌ జి మాధవన్‌ నాయర్‌
సూళ్లూరుపేట (తిరుపతి) : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్‌-3 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో ఈ ప్రయోగానికి గురువారం మధ్యాహ్నం 1.05 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఈ కౌంట్‌డౌన్‌ దాదాపు 25 గంటల పాటు సాగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 2:35:13 గంటలకు రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది.తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరిని ఇస్రో చైర్మెన్‌ సోమనాధ్‌ గురువారం ఉదయం దర్శించి పూజలు చేశారు. శ్రీహరికోట నుంచి గురువారం జరిగే చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుంటూ పూజలు చేశారు. ఈ సందర్భముగా సోమనాధ్‌ మీడియాతో మాట్లాడుతూ చంద్రయాన్‌ -3 ప్రయోగం నిర్ణయించిన సమయానికి జరుగుతుందని తెలిపారు. ప్రయోగం అనంతరం 40రోజులు చంద్రయాన్‌-3 ప్రయాణం చేస్తుందనీ, ఆగస్టు 23 తరువాత చంద్రయాన్‌-3 చంద్రుని పైకి దిగుతుందని తెలిపారు. చంద్రయాన్‌-3 ప్రయోగం అన్ని విధాలుగా విజయవంతమవుతుందని ఇస్రో మాజీ చైర్మెన్‌ జి మాధవన్‌ నాయర్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. చంద్రుడి ఉపరితలంపై ఇస్రో ప్లాన్‌ చేసిన సాఫ్ట్‌ ల్యాండింగ్‌ సంక్లిష్టమైందని తెలిపారు. ఆయన జాతీయ మీడియా సంస్థతో గురువారం మాట్లాడారు. మిషన్‌ ఇస్రోకు ఓ మైలురాయి అనీ, నాలుగేండ్ల కిందట చంద్రయాన్‌-2 సాఫ్ట్‌ ల్యాండింగ్‌ సమయంలో ఎదురైన సమస్యలు, సవాళ్లను దృష్టిలో పెట్టుకొని ఈసారి వ్యవస్థను పటిష్టం చేసిందన్నారు.
చంద్రయాన్‌-3 ద్వారా కొత్త విషయాలు
శాస్త్రవేత్త రామకృష్ణ, బ్రోచర్‌ ఆవిష్కరణ
నవతెలంగాణ – బంజారాహిల్స్‌
చంద్రయాన్‌-3 ద్వారా చంద్రుడిపై నూతన పరిశోధనలు నిర్వహిస్తారని, ప్రపంచానికి కొత్త విషయాలు చెబుతామని ఇస్రో రిటైర్డ్‌ సీనియర్‌ శాస్త్రవేత్త రామకృష్ణ అన్నారు. చంద్రయాన్‌-3 లాంచ్‌ నేపథ్యంలో హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం బ్రోచర్లను ఆవిష్కరించారు. ప్లానిటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ ఎన్‌.శ్రీరఘునందన్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తన 38 సంవత్సరాల సర్వీసులో ఇస్రో అనేక పరిశోధనలు జరిపి విజయవంతమైన ప్రయోగాలు చేసిందన్నారు. భూమిపై మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన క్రమంలో చంద్రాయన్‌-3 ద్వారా చంద్రునిపై నివాసం తదితర అంశాలపై పరిశోధనలు జరుగుతాయని తెలిపారు. చంద్రునిపై దక్షిణ ద్రువంలోకి ఈ రాకెట్‌ను ప్రయోగిస్తున్నామని, రోవర్‌ ద్వారా అనేక విషయాలను వెలుగులోకి తీసుకొస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఓయూ జియో ఫిజిక్స్‌ రిటైర్డ్‌ హెచ్‌ఓడీ ప్రొఫెసర్‌ జి.రాందాస్‌, ఓయూ కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్‌ కె.వెంకటేశ్వర్‌రావు, సెంటర్‌ ఫర్‌ స్పేస్‌ మెడిసిన్‌ నిపుణులు డాక్టర్‌ విజయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love