అంతచక్షువుతో అక్షరీకరించిన ఛార్‌ధామ్‌ యాత్ర

aadhyatmika darullo chardham yatraTRAVELLING-IT LEAVES YOU SPEECHLESS, THEN TURNS YOU INTO A STORYTELLER
– IBAN BATTUTA
కూరెళ్ళ పద్మాచారి దృశ్యీకరించిన ”ఆధ్యాత్మికదారుల్లో ఛార్‌ధామ్‌ యాత్ర” ఒకవి శిష్టమైన సాహితీ విలువలున్న యాత్రాచరిత్ర (Travelogue) గ్రంథం. తను చూసిన దృశ్యాల్ని చూసినట్లుగా దృశ్యీకరించి మనకు ఆ అనుభవాన్ని అందించడంలో పద్మాచారి కృతకృత్యుడయ్యారని ఈగ్రంధం చదివేతే అవగతం అవుతుంది. చారి తన కళ్ళకెమెరాల్లో చిక్కిన అక్కడి అద్భుత సుందర దృశ్యాల్ని తన కవితాత్మక హృదయంలో ముంచి మనకు అందించాడనటంలో అతిశయోక్తిలేదు. ప్రపంచంలో ఎంతోమంది ప్రయాణికులు రకరకాల ప్రదేశాలకు వెళతారు. అక్కడి అందమైన ప్రదేశాలను చూసి ఆనందిస్తారు. కానీ ఆ ఆనందాన్ని, ఆ దృశ్యాల్ని అక్షరాల్లో నింపి మనల్ని ఆ అక్షరాలతో మమేకం చేసి అబ్బుర పరిచే రసవిద్య తెలిసిన రచయితల్లో పద్మాచారి కూడా ఈ రచనతో చేరి పోయాడు.
ఈ ట్రావెలాగ్‌ చదువుతుంటే నాకుS. T. Coleridge theory – Primary imagination and SecondaryImagination’ గుర్తుకొచ్చింది. పద్మాచారి తన Primary Imagination తో చూసిన అందాల్ని, పొందిన అనుభూతుల్ని Secondary Imagination తో అక్షర శిల్పాలుగా చెక్కి ఛార్‌ధామ్‌ గ్రంథరూపంలో మనకందించడం ఎంతో ముదావహం. ఈ ”ఆధ్యాత్మిక దారుల్లో ఛార్‌ధామ్‌యాత్ర” అనే యాత్రాచరిత్ర గ్రంధంతో తెలుగు సాహిత్య చరిత్రలో యాత్రా సాహిత్య చరిత్రగా నిలిచిపోతుంది.
వీరి ఛార్‌ధామ్‌ యాత్ర ఢిల్లీలోని అక్షరధామ్‌తో మొదలై అతిముఖ్యమైన, యమునోత్రి, గంగోత్రి, కేదారినాధ్‌, భద్రినాధ్‌తో ముగుస్తుంది. ఈ యాత్రాచరిత్రను సీరియస్‌గా చదివితే ఈగ్రంథ రచయితలో బహుముఖాలు కనిపిస్తాయి. ఒక్కోసారి ఒక్కోరకంగా.. ఒక కవిగా, ఒక చరిత్రకారుడిగా, పరిశోధకుడిగా, ప్రకృతి ఆరాధకుడిగా కనిపిస్తాడు. ఏ ప్రాంతానికెళ్లినా ఆప్రాంతం యొక్క ఔన్నత్యాన్ని, చారిత్రక నేపధ్యాన్ని వివరంగా వర్ణించాడు. కొన్ని పాంతాల్ని కవితామయం చేసి మనలో నిద్రాణమై ఉన్న రసహృదయాల్ని తట్టిలేపుతాడు. ”మంచుతో కప్పబడిన మట్టిభాగాల్ని అక్కడక్కడ బయటికీ కనిపించే కొండల్ని వెండికాగితాలు అతికించిన కలాకన్‌” ముక్కలనడం పద్మాచారి యొక్కఅద్భుతమైన సౌందర్య దృష్టికి తార్కాణం. శ్రీస్వామి నారాయణ అక్షరధామ్‌ కళాకృతుల్ని చూసి భారతంలోని మయసభతో పోల్చడం రచయిత యొక్క ఊహాశాలీనతకు అద్దంప డుతుంది.
ప్రముఖ కవి, విమర్శకులు డా||ఎస్‌. రఘుగారు ఈగ్రథానికి రాసిన మిత్రవాక్యంలో ”పద్మాచారి లోని తెలుగు సాహిత్య, పాండిత్యజ్ఞానం, భోదనాశైలి, పరవళుతొక్కుతూ పఠనాసక్తిని ద్వీగుణీకృతం చేస్తుంది. ఎక్కడ అవకాశమొచ్చినా అక్కడ సాహితీపరిమళాల్ని వేదజల్లాడు. విమానంగాల్లోకి ఎగరగానే కదులుతున్న మబ్బుల్ని చూసికాళిదాసును స్మరించుకుంటాడు. తన ముచ్చటైన జ్ఞాపకాలను మేఘసందేశంతో అనుభూతికి గురి చేస్తాడు” అంటారు.
ముస్సోరి కొండ ప్రాంతంలో ఉన్నSt. George College (1853) లో నిర్మించి, 400 ఎకరాల్లో విస్తరించిన అతిప్రాచీన కాలేజీ గురించి రాసే ఒక చరిత్రకారునిగా కనిపిస్తాడు. నిజానికి ప్రయాణమనేది ఒకసాహసవంతమైన ప్రక్రియ. ఎంతో ఓపిక, ఉత్సహం ఉంటే తప్ప దూరమైన ప్రదేశాలకు వెళ్లరు. అటువంటిది ఛార్‌ధామ్‌యాత్రంటే ఎన్నో రకాల అడ్డంకుల్ని అధిగమించి ప్రయాణం చేయాల్సి వస్తది.Indeed, travelling itself is an adventure.. వీళ్ళది సాహసవంతమైన ప్రయాణం కావడం మూలాన అందులో ఆనందాలేకాదు కొన్నిసార్లు విషాదాలు కూడా తారసపడుతుంటాయి. అందులో భాగమైన తన సహప్రయాణికుడు శ్రీనివాస్‌ని కుక్క కరవడం. ఆ దుర్ఘటనను కర్మసిద్ధాంతంగా భావించి ముందుకి సాగిపోవడం పద్మాచారిలోని పాజిటివ్‌ ఆటిట్యూడ్‌ని తెలియపరుస్తుంది.
యమునోత్రిలో వాళ్ళు చేసే గుర్రాల మీద ప్రయాణాన్ని వివరిస్తూ రచయిత తాను ప్రయాణం చేసిన గుర్రంపేరు ‘చేతక్‌’ అని, ఆ చేతక్‌ అనే గుర్రం పేరును మహారాజా రాణాప్రతాప గుర్రం పేరు కూడా అదే కావడాన్ని గుర్తు చేస్తాడు. ఈ సంఘటనను బట్టి రచయిత చారిత్రక జ్ఞానాన్ని, సునిశిత పరిశీలనను అర్థం చేసుకోవచ్చు.
కేదారినాధ్‌ క్షేత్రం గురించి రాస్తూ రాంపూర్‌ నుంచి సొన్ప్రయాగకు రాత్రివేళ టార్చి లైట్ల వెలుగులో గుంపులుగా నడుస్తూ సొన్ప్రయాగ చేరుకోవడం. సొన్ప్రయాగ రుద్రప్రయాగ జిల్లాలోని ఒక గ్రామం. ప్రయాగ అంటే నదుల కలయిక అని చెప్పుకుంటూ ప్రతిప్రాంతాన్ని ఆ ప్రాంతం యొక్క ఔన్నత్యాన్ని వర్ణించడం వల్ల రచయితకున్న క్యూరియాసిటీ తెలుస్తుంది. ఏదో ఒక కొత్త ప్రాంతానికి వెళ్లాంలే, చూశాంలే, వచ్చాంలే అని కాకుండా ఆ ప్రాంతాల వైశిష్ట్యాన్ని తెలుసుకొని పాఠకులకు అందించడమనేది ఈ రచయితలో ఉన్న జిజ్ఞాసకు తార్కాణం.
బదరీనాధుని పుణ్యక్షేత్రం దర్శించిన రచయిత రాత్రి గురించి రాస్తూ ‘చీకటి’ దుప్పట్లను కప్పుకున్న కొండలు డ్యూటీదిగినట్లు తెల్లని మంచు వస్త్రాలను ధరించి సేదదీరటం ఉదయభానుడి లేత కిరణాలు సోకి బంగారు మణులై ప్రజ్వరిల్లినట్లు కవితామయం చేయటం రచయితకు ఒక మరపురాని అనుభూతి. కిటికీ ప్రయాణం గురించి చెపుతూ .. గాలి కల్లోల కురుల్ని కిటికీ అద్దం క్రమబద్దంగా సంస్కరించి లోపలికి పంపుతుంది. ఈ ప్రయాణం తనకు ‘గత జ్ణాపకాల ఊరేగింపు’ గతానుగత సన్నివేశాలు హృదయపు లోతుల్లోంచి ఉబికి వచ్చి నా మనోఫలకం ముందు నాట్యమాడుతాయి’ అంటాడు.
విశ్రాంత అసోసియేట్‌ ప్రొఫెసర్‌ మచ్చ హరిదాసు ఈ గ్రంథానికి రాసిన ముందుమాటలో ఇలా అంటారు. ”నిజమే, పద్మాచారి మిగతా ప్రయాణికులలాగా కేవల బ్రమణ మాత్రుడుకాడు. యాత్రను అంతరికంగా అనుభవించి స్వీయానుభూతి పరిమళాలతో నింపుతాడు. కాబట్టి ఆయన చేసిన యాత్ర ఒకరకంగా సాహిత్య విలువలున్న యాత్రలాగే పరిణమించింది.”
‘Beauty lies in the eyes of beholde అన్నట్లు మంచుకొండలు అద్భుతమైన లోయలు, చల్లనిగాలులు, ఆకాశాన్నంటే మంచుకొండలు, ఈ అందాలన్నీ ఒక్కసారిగా కనిపిస్తే ఎవరికైనా అమాంతం హరివిల్లును వాటేసుకున్న అనుభూతి కలగక మానుతుందా! పద్మాచారి చూసిన ఆ దృశ్యాలన్ని ఆనందాశ్చర్యాలకు గురిచేసి ఆయన ప్రయాణాన్ని ఒక మారుపురురాని మధురానుభూతిగా మిగిల్చాయి అనుటలో సందేహం లేదు.
డా|| బాణాల శ్రీనివాసరావు, 9440471423

Spread the love