అలవెన్స్‌లకు చెక్

Check for allowances– ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌తో ఎగవేత
– ఉపాధి హామీలో కేంద్రం మరో మోసం
– రాష్ట్రంలో ఏడాదికి రూ.2 వేల కోట్ల నష్టం
– రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలకు అవకాశం కరువు
– తట్ట, గడ్డపార, తాగునీరు బిల్లులకూ దిక్కులేదు
– ఆందోళనలో ఉపాధి కార్మికులు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
గ్రామీణ ఉపాధి హామీ చట్టంపై కేంద్రం మరో మోసానికి పాల్పడింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కార్మికుల నోటికాడి బుక్క కూడా ఉండేలా లేదు. ఉపాధి హామీ చట్టం అమలులోకి వచ్చిన నాటి నుంచి వేసవి కాలంలో కూలీలకు వేసవి భత్యం కింద కూలి డబ్బులకు అదనంగా 20 నుంచి 30 శాతం బోనస్‌ ఇచ్చేది. ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన ఎన్‌ఐసీ (నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌) సాఫ్ట్‌వేర్‌తో అలవెన్స్‌లకు చెక్‌ పడింది. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే తట్ట, గడ్డపార డబ్బులకు కూడా అవకాశం లేకుండా చేయడం తో ఉపాధి కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన వేతనంలో సగం డబ్బులు తట్ట, గడ్డపార, తాగు నీటి ఖర్చులకే పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు, వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు 2005లో నాటి యూపీఏ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం కింద ప్రతి కుటుంబానికీ ఏడాదిలో వంద రోజులు పని దినాలు కల్పించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాబ్‌ కార్డులను 1.5 కోట్ల కుటుంబాలు కలిగి ఉన్నాయి. ఇందులో సుమారు 60 నుంచి 70 లక్షల మంది రెగ్యులర్‌గా పనికి వెళ్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 3,47,241 జాబ్‌ కార్డులు ఉండగా ఇందులో 6,49,675 మంది కూలీలు ఉన్నారు. ఇందులో రెగ్యులర్‌గా రెండు లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవుతున్నారు. వ్యవసాయ పనులు లేని సమయంలో ఈ సంఖ్య రెండింతలుంటుందని అధికారులు తెలిపారు. అయితే ఉపాధి హామీపై కేంద్రం పెడుతున్న ఆంక్షలు కూలీలకు ఇబ్బందులు కల్గిస్తున్నాయి.
రూ.2 వేల కోట్ల వేసవి భత్యం ఎగవేత..
ఉపాధి హామీ చట్టం ప్రారంభం నుంచి వేసవి భత్యం పేరుతో ప్రతి ఏడాదీ ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు చేసిన పనికి అదనంగా బోనస్‌ వచ్చేది. ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్‌, మేలో 30 శాతం, జూన్‌లో 25 శాతం సమ్మర్‌ అలవెన్స్‌ వచ్చేది. కానీ కేంద్ర ప్రభుత్వం 2021 డిసెంబర్‌లో ఐఎన్‌సీ సాఫ్ట్‌వేర్‌ తీసుకువచ్చింది. ఈ సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి అలవెన్స్‌ కాలం లేకుండా డిజైన్‌ చేసింది. దాంతో కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలకు కూడా డబ్బులు అందడం లేదు. ఒక నెలలో ఒక కుటుంబానికి 14 రోజుల పని దినాలు కల్పిస్తోంది. అయితే ఎక్కువగా ఉపాధి హామీ పనుల కల్పన జనవరి నుంచి జూన్‌ వరకు ఉంటుంది. జనవరి, ఫిబ్రవరిలో వ్యవసాయ పనులు పూర్తికాగానే ఉపాధి పనులకు కూలీలు హాజరవుతుంటారు. నెలలో ఒక కుటుంబం సమ్మర్‌ అలవెన్స్‌ రూ. 420 కాగా.. ఆరు నెలలకు గాను రూ. 2520 అవుతుంది. ఒక కుటుంబం ఏడాదికి సుమారు రూ. 2,520 నష్టపోతుంది. ఈ లెక్కన ఉమ్మడి రంగారెడ్డిలో రెగ్యులర్‌గా పనులకు హాజరవుతున్న సుమారు మూడు లక్షల మంది కూలీలకు గాను సుమారు రూ. 75 కోట్లా 60 లక్షలు నష్టపోతున్నారు. రాష్ట్రమంతటా హాజరవుతున్న 60లక్షల మంది కూలీలకు గాను సుమారు రూ. 2 వేల కోట్ల వరకు నష్టపోతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, కూలీలకు రావాల్సిన డబ్బులు చెల్లించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.
అలవెన్స్‌లకు అవకాశం లేదు
కేంద్రం తీసుకొచ్చిన సాఫ్ట్‌వేర్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అలవెన్స్‌లకు అవకాశం లేకుండా పోయింది. ఐఎన్‌సీ సాఫ్ట్‌వేర్‌లో అటెండెన్స్‌, పని కొలతల వివరాలు తప్ప మరొకటి నమోదు చేయడానికి అవకాశం లేదు.
– శ్రీలత, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి
కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
ఉపాధి హామీపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి. కొత్త సాఫ్ట్‌వేర్‌ పేరుతో కూలీలను దగా చేస్తున్నారు. రెండు పూటలా అటెండెన్స్‌ తీసుకుంటున్నారు. పని భారం పెంచారు. కానీ ఇచ్చే అలవెన్స్‌లో కోతలు పెట్టారు. కార్మికులకు కూలి గిట్టడం లేదు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, కూలీలకు రావాల్సిన డబ్బులు చెల్లించాలి.
– జగన్‌, వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి

Spread the love