చరిత్రకు చెద ‘రజాకార్‌’

ఏ కుక్కో వచ్చి చెరిపివేస్తే..
పోయేది కాదు.. కమ్యూనిస్టుల చరిత్ర
ఏ నక్క పన్నాగానికో మసక బారేది కాదు
సాయుధ పోరాట గాధ
భూమి కోసం.. భుక్తి కోసం..
వెట్టి చాకిరి విముక్తి కోసం
సాగిన పోరే తెలంగాణ
రైతాంగ సాయుధ పోరాటం
ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకం
ఉత్తి చేతులను బంధూకులుగా
ముల్లుగట్టెలను ఈటెలుగా
బండరాళ్లను ఫిరంగి గుండ్లుగా చేసి
కారంపొడి, గుత్పకట్టెలతో
రాక్షస మూక రజాకార్లను
తరిమిన పోరు
నా తెలంగాణ చరిత్ర
చిత్రహింసలకు ఒళ్లు చిధ్రమవుతున్నా..
మర్మాంగాలు కోసి సజీవదహనం చేస్తున్నా..
ఆ మంటల్లో రగిలిన జ్వాలే
నా తెలంగాణ చరిత్ర
విరిగిన ఎముకలు బూడిదైన శరీరం
ఎరుపు రంగునద్దుకుని
రజాకార్లనూ, దేశ్‌ముఖ్‌లనూ
అంతమొందించి
నిజాంనే గడగడలాడించింది
నా తెలంగాణ చరిత్ర
గతిలేక, గత్యంతరం లేక నిజామోడు
పటేల్‌ ముందు మోకరిల్లితే
యూనియన్‌ సైన్యం దన్నుగా నిలిచి
రైతాంగ పోరాట వీరులనే ఊచకోత కోసే..
దేశమంతా స్వేచ్ఛావాయువులు పీల్చుతుంటే
తెలంగాణలో విముక్తి కోసం, స్వాతంత్య్రం కోసం
విరోచితంగా పోరాడుతున్న వీరులను
నెత్తురు మడుగులో
మాంసం ముద్దలు చేసింది ఆ సైన్యమే
రైతులకూ, రైతు కూలీలకూ
పంచిన భూమినీ ఆస్తులనూ
తిరిగి దేశ్‌ముఖ్‌లకూ
నిజాంకూ అప్పగించిందీ ఆ సైన్యమే
నిజాంను గవర్నర్‌ను చేసింది
ఆ సర్దార్‌ వల్లభారు పటేలే
ఏదో ఓ సిన్మా తీసి మతమే కారణమంటే
అంతకంటే తెలంగాణా సాయుధ పోరాటానికి
అవమానమేముందీ? అయినా..
గాడిదకు కామధేనువు జన్మించిందనీ
ఆ కామధేనువు కుండెడు పాలిచ్చిందనీ
ఆ పాలు తాగితే స్వర్గమేనని నమ్మించే
ప్రబుద్ధ పార్టీ బుర్రలోంచి వచ్చిన
సినిమా నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం?
(‘రజాకార్‌’ చిత్రాన్ని నిరసిస్తూ..)
– ఎం.విష్ణు ప్రసాద్‌

Spread the love