చెంచు మహిళ కుటుంబానికి రక్షణ

చెంచు మహిళ కుటుంబానికి రక్షణ– డ్రగ్స్‌ నివారణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి సీతక్క
– నిమ్స్‌లో బాధితురాలికి పరామర్శ
నవతెలంగాణ-బంజారాహిల్స్‌
నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొల్లాపూర్‌కు చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మను బుధవారం మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈశ్వరమ్మకు మెరుగైన చికిత్సలు అందిస్తున్నామని, ఆమె కుటుంబానికి సంపూర్ణ రక్షణ కల్పిస్తామని తెలిపారు. దోషులు ఎంతటి వారైనా వదిలేది లేదని, ఇప్పటికే పోలీస్‌ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. నాగరిక సమాజంలో అనాగరిక చర్యలకు పాల్పడే ఎవరినీ వదలబోమని హెచ్చరించారు. తమ ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీసులు.. బాధితుల పక్షానే ఉంటూ నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తారని తెలిపారు. ఇప్పటికే ఈశ్వరమ్మ కుటుంబానికి ఐటీడీఏ, ఎస్సీ ఎస్టీ, ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ శాఖల తరఫున ఆర్థిక సాయం అందజేశామన్నారు. బాధితురాలు పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందన్నారు. అదేవిధంగా.. వారి కుటుంబంలో ఓ వ్యక్తి కూడా అనుమానాస్పదంగా మృతిచెందినట్టు బాధితులు తెలపగా.. సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. తమ ప్రభుత్వం డ్రగ్స్‌పై కఠినంగా వ్యవహరిస్తున్నదని.. డ్రగ్స్‌ సేవించి మహిళ లపై, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని శిక్షిస్తామని తెలిపారు. మంత్రి వెంట నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప, సూపరింటెండెంట్‌ సత్య నారాయణ, ఇతర వైద్యులు, చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అధికారులు, పీడబ్ల్యూఓ సంధ్య, ఇతర మహిళ సంఘాల ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

Spread the love