ఛత్తీస్‌గఢ్‌ ఒప్పంద భారం రూ.6 వేల కోట్లు

ఛత్తీస్‌గఢ్‌ ఒప్పంద భారం రూ.6 వేల కోట్లు– ఇప్పటికీ ఈఆర్సీ ఆమోదమే లేదు
– ఇదీ సర్కారు వాదన
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారంపై జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి ఏకసభ్య కమిషన్‌కు మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కే చంద్రశేఖరరావు (కేసీఆర్‌) రాసిన లేఖ రాజకీయ దుమారాన్ని రేపుతుంది. కమిషన్‌ ఏర్పాటే సరికాదనీ, జస్టిస్‌ నర్సింహారెడ్డి స్వచ్ఛందంగా విచారణ నుంచి తప్పుకోవాలని కేసీఆర్‌ తన లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై అధికార కాంగ్రెస్‌పార్టీ తీవ్రంగానే స్పందించింది. కమిషన్‌ విచారణకు సహకరించాలని కోరింది. అదే సమయంలో కేసీఆర్‌ లేఖ నేపథ్యంలో పలు అంశాలను పేర్కొంటూ ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇచ్చింది. దానిలో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌తో తెలంగాణ విద్యుత్‌ సంస్థలు అంచనాలకు మించి నష్టపోయాయంటూ కొన్ని గణాంకాలను విడుదల చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి… ఒప్పందం ప్రకారం ఛత్తీస్‌గఢ్‌ కరెంటు ఒక్క యూనిట్‌ ధర రూ.3.90 మాత్రమే అని కేసీఆర్‌ చెబుతున్నప్పటికీ, అది పాక్షిక వాస్తవమేనని వివరణ ఇస్తున్నారు. ”ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కొన్న విద్యుత్‌ 17,996 మిలియన్‌ యూనిట్లు. ఇప్పటివరకు చేసిన చెల్లింపులు రూ.7,719 కోట్లు. ఛత్తీస్‌గఢ్‌కు చెల్లించాల్సిన బకాయిలు రూ.1,081 కోట్లు. ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ ఛార్జీలు రూ.1,362 కోట్లు. ఇవన్నీ లెక్కిస్తే ఒక్కో యూనిట్‌కు అయిన ఖర్చు రూ.5.64గా లెక్క కట్టారు. దీనిప్రకారం దాదాపు రూ.3,110 కోట్లు అదనపు భారం పడిందని విశ్లేషించారు. బకాయిల విషయంలోనూ రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఇంకా తేలలేదనీ, కేవలం రూ.1,081 కోట్ల బకాయిలున్నాయని తెలంగాణ చెప్తుండగా, రూ.1,715 కోట్లు ఉన్నాయని ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ సంస్థలు లెక్కలు చూపిస్తున్నాయి. బకాయిల వివాదంపై ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ సంస్థలు ఎలక్రిసిటీ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశాయి. ”ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ 2017 చివరి నుంచి అందుబాటులోకి వచ్చింది. ముందునుంచీ అరకొరగానే సరఫరా అయ్యింది. ఎన్నడూ వెయ్యి మెగావాట్లు సాఫీగా రాలేదు.
అక్కడి నుంచి ఆశించిన సరఫరా తగ్గిపోవటంతో తెలంగాణ డిస్కంలు బహిరంగ మార్కెట్లో విద్యుత్తు కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీంతో 2017 నుంచి 2022 వరకు పడిన అదనపు భారం రూ.2,083 కోట్లు” అని ప్రభుత్వ వర్గాలు లెక్కకట్టాయి. 2022 ఏప్రిల్‌ నుంచి ఈ విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ను తెచ్చుకునేందుకు పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ (పీజీసీఐఎల్‌)తో వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ సరఫరాకు కారిడార్‌ బుక్‌ చేసుకోవాల్సి వచ్చింది. ఒప్పందం ప్రకారం విద్యుత్‌ తెచ్చుకున్నా, తెచ్చుకోకపోయినా పీజీసీఐఎల్‌కు సరఫరా ఛార్జీలు కట్టాల్సిందే. ఈ లెక్కన కరెంటు రాకున్నా అదనంగా కట్టిన చార్జీలు రూ.638 కోట్లు అని లెక్కతేల్చారు. కారిడార్ల బుకింగ్‌తోను అదనపు నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి. కేవలం వెయ్యి మెగావాట్ల కారిడార్‌ సరిపోతుండగా, అనవసరంగా మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ సరఫరాకు అడ్వాన్సుగా కారిడార్‌ బుక్‌ చేశారనీ, ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ రాదని తెల్సి ఆ కారిడార్‌ను అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారని తెలిపారు. దీనితో పరిహారం కింద రూ.261 కోట్లు కట్టాలని పీజీసీఐఎల్‌ డిస్కంలకు నోటీసులు జారీ చేసిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
అసలు ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందానికి తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి (టీజీఎస్‌ఈఆర్సీ) ఇప్పటి వరకు ఆమోద ముద్ర వేయనే లేదని తేల్చిచెప్తున్నారు. ఈఆర్సీ ఆమోదం లేకుండానే ఛత్తీస్‌గఢ్‌కు వేల కోట్ల రూపాయల్ని అడ్డదారి చెల్లింపులుగానే పరిగణించాలనే వాదనలు వినిపిస్తున్నారు.

Spread the love