హైద‌రాబాద్ చేరుకున్న ఢిల్లీ, పంజాబ్ ముఖ్య‌మంత్రులు

నవతెలంగాణ – హైద‌రాబాద్ : ఢిల్లీ, పంజాబ్ ముఖ్య‌మంత్రులు అర‌వింద్ కేజ్రీవాల్, భ‌గ‌వంత్ మాన్‌లు హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఐటీసీ కాక‌తీయ హోట‌ల్‌కు వెళ్లారు. అక్క‌డ్నుంచి ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు చేరుకోనున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌తో క‌లిసి అర‌వింద్ కేజ్రీవాల్, భ‌గ‌వంత్ మాన్ లంచ్ చేయ‌నున్నారు. కేజ్రీవాల్‌ వెంట ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిషి కూడా ఉన్నారు. జాతీయ రాజకీయాలు, భారత సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధంగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. ఢిల్లీలో అధికారుల బదిలీ, పోస్టింగ్‌లపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతును ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రివాల్‌ కోరుతున్న విషయం తెలిసిందే. ఇరువురు సీఎంల భేటీ సందర్భంగా ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశాలున్నాయి. దేశ రాజధాని పరిధి ఢిల్లీలో గ్రూప్‌-ఏ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలు తదితర కీలక విషయాలను కేంద్రం తన పరిధిలోకి తీసుకున్నది. ఇందుకోసం ఈనెల 19న ప్రత్యేక ఆర్డినెన్స్‌ను కేంద్రం జారీ చేసింది. సంబంధిత ఉద్యోగుల విషయాలపై నిర్ణయాలు తీసుకోవటానికి జాతీయ రాజధాని సివిల్‌ సర్వీస్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఢిల్లీ ముఖ్యమంత్రి చైర్మన్‌గా, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. మెజారిటీ సభ్యుల నిర్ణయం ప్రకారం ఉద్యోగుల బదిలీలు, నియామకాలు జరుగుతాయని ఆర్డినెన్స్‌లో పేరొన్నారు. అయితే ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై నియంత్రణాధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును అమలు పరచాల్సిందేనని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తోపాటు మంత్రులు డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పును ఆర్డినెన్స్‌ ద్వారా అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని కేజ్రీవాల్‌ ఆరోపిస్తూ కేంద్రంపై పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్‌ ఇప్పటికే పలువురు నేతలను కలిశారు. ఈ క్రమంలోనే ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం కాబోతున్నారు.

Spread the love