పెరుగుతున్న బాల కార్మికులు !

United Nations warns of rising child labour– ఐక్యరాజ్య సమితి హెచ్చరిక
న్యూయార్క్‌ : ప్రపంచవ్యాప్తంగా చదువు మానేసి బలవంతంగా పనిలోకి దిగుతున్న పిల్లల సంఖ్య పెరుగుతోందని ఐక్యరాజ్య సమితి మంగళవారం హెచ్చరించింది. లైంగికంగా దోపిడికి గురవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోందని పేర్కొంది. అంతర్జాతీయంగా ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తిరోగమనం నెలకొందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) డైరెక్టర్‌ జనరల్‌ గిల్బర్ట్‌ హంగ్బో తెలిపారు. ద్రవ్యోల్బణం పెరగడంతో పాటూ కోవిడ్‌ ప్రభావం కూడా తోడవడంతో ప్రజల జీవన వ్యయం పెరిగి పోయిందని, దాంతో పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారాయని ఆయన బిబిసికి తెలిపారు. ఇప్పుడు గనక మనం సరైన చర్యలు తీసుకోని పక్షంలో, వేగంగా నిర్ణయాలు తీసుకోనట్లైతే సమస్య ఇంకా ముదురుతుందని అన్నారు.
2020 ప్రారంభంలో దాదాపు 16లక్షల మంది పిల్లలు బాల కార్మికులుగా మారారని ఐక్యరాజ్య సమితి డేటా పేర్కొంది. ఈ పరిస్థితులను మార్చేందుకు అంతర్జాతీయంగా జరుగుతున్న కృషి 20 ఏండ్లలో మొదటిసారిగా స్తంభించిందని అన్నారు.
రోజుకు ఒక పూట కూడా భోజనం దొరకని కుటుంబాలు వున్నాయని, అటువంటి కుటుంబాల్లోని పిల్లలు చివరకు బాల కార్మికులుగా రూపాంతరం చెందుతున్నారని అన్నారు. తమ కుటుంబ అవసరాల కోసం పిల్లలను లైంగిక వ్యాపారంలోకి దించే వారూ కూడా వున్నారని అన్నారు. కెన్యాలోని మొంబసాకి చెందిన 14ఏళ్ళ బాలిక తన కుటుంబ అవసరాల కోసమే పడుపు వృత్తిలోకి దిగిందని బీబీసీ తన వార్తా కథనంలో పేర్కొంది. కోవిడ్‌ సమయంలో ఇవేవీ లేకపోవడంతో రోజు గడవడం కష్టమైపోయిందని తెలిపింది. అందరి పిల్లల్లా తన బిడ్డ కూడా స్కూలుకు వెళ్లాలని కోరిక వుంటుందని, కానీ బతుకు గడిచే పరిస్థితి లేకపోవడంతో ఇలా పనిలోకి దింపడం తప్పడం లేదని ఆ తల్లి వాపోయింది.
అన్ని దేశాల్లోనూ ఈ బాల కార్మికుల సంఖ్య పెరుగుతోందని, వ్యవసాయం, గనులు, నిర్మాణ రంగాలతో సహా అన్ని చోట్లా ఈ సమస్య వుందని హంగ్బో చెప్పారు.
ఒక్క మాటలో చెప్పాలంటే మనం చాలా సంక్లిష్టమైన దశలో వున్నామని హంగ్బో చెప్పారు. దారిద్య్రమే ఇందుకు ప్రధాన కారణమని అన్నారు. ప్రభుత్వాలు మరింత క్రియాశీలంగా వ్యవహరించాల్సిన అవసరం వుందన్నారు.

Spread the love