నులిపురుగుల నిర్మూలనతోనే బాలల ఆరోగ్యం పదిలం

నులిపురుగుల నిర్మూలనతోనే బాలల ఆరోగ్యం పదిలం– వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
– రాజ్‌ భవన్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలు వేసిన మంత్రులు
– నులిపురుగుల నిర్మూలన పోస్టర్‌ ఆవిష్కరణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందని, నులిపురుగుల నిర్మూలనతోనే పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా గురువారం రాజ్‌ భవన్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రితో కలిసి ఆయన ఆల్బెండజోల్‌ మాత్రలు వేశారు. నులి పురుగుల నివారణ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి దామోదర్‌ రాజనర్సింహ మాట్లాడుతూ.. రక్తహీనత, నీరసం, చదువులో వెనుకబడటం వంటి లక్షణాలకు నులి పురుగులే ప్రధాన కారణమని తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందన్నారు. విద్యతోపాటు సంస్కారవంతులు కావాలన్నారు. సమాజంలో ఆణిముత్యంలా బతకాలని విద్యార్థులకు సూచించారు.రవాణా బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో డీ వార్మింగ్‌ డే జరుపుకుంటున్నాం.. పిల్లల శారీరక ఎదుగుదలకు సంబంధించి డీ వార్మింగ్‌ టాబ్లెట్స్‌ ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు. నేటి నుంచి 27 వరకు హైదరాబాద్‌లో ఉన్న 11 లక్షలా 78 వేలా 118 మంది పిల్లలకు నులి పురుగుల నివారణ మాత్రలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 1-19 ఏండ్ల వయస్సు పిల్లలకు ఈ మందులు వేస్తారన్నారు. శారీరక ఎదుగుదల సక్రమంగా ఉండాలంటే ఈ మాత్రలు తప్పనిసరి అని, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ మాత్రలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్‌లో ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ బుర్రా వెంకటేశం, హెల్త్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ క్రిస్టినా జెడ్‌.చోంగ్తు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌, జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.

Spread the love