చైనా జిడిపి అంచనాలు పెంపు

చైనా జిడిపి అంచనాలు పెంపు– 5 శాతం నుంచి 5.4 శాతానికి చేరొచ్చు: ఐఎంఎఫ్‌
జెనివా : చైనా ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగు పడొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. ప్రస్తుత ఏడాదిలో ఆ దేశ వృద్థి రేటు 5.4 శాతంగా, 2024లో 4.6 శాతంగా ఉండొచ్చని విశ్లేషించింది. ఇంతక్రితం ఈ అంచనాలు వరుసగా 5 శాతం, 4.2 శాతంగా ఉన్నాయి. కాగా వచ్చే ఏడాది జిడిపిలో తగ్గుదల చోటు చేసుకోవచ్చని పేర్కొంది. ఇందుకు అక్కడి రియల్‌ ఎస్టేట్‌ రంగం స్తబ్దతలో ఉండటమే కారణమని పేర్కొంది. ఇంతక్రితం అంచనాలతో పోల్చితే చైనా ఆర్థిక వ్యవస్థ 0.4 శాతం పాయింట్లు మెరుగుపడొచ్చని ఐఎంఎఫ్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గీతా గోపినాథ్‌ పేర్కొన్నారు. ప్రాపర్టీ మార్కెట్‌కు మద్దతును ఇవ్వడానికి చైనా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు.
ఈ సమగ్ర పాలసీ ప్యాకేజీలో ఆచరణ సాధ్యం కాని ప్రాపర్టీ డెవలపర్‌ల నిష్క్రమణను వేగవంతం చేయడం, నివాసాల ధరల స్థిరీకరణకు అడ్డంకులను తొలగించడం, గృహ నిర్మాణాలను పూర్తి చేయడానికి అదనపు కేంద్ర ప్రభుత్వ నిధులను కేటాయించడం, బ్యాలెన్స్‌ షీట్‌లను సరిచేయడం తదితర చర్యలు చేపడుతుందని గీతా పేర్కొన్నారు. 2023లో ప్రపంచ వృద్థి 3 శాతంగా, 2024లో 2.9 శాతంగా ఉండొచ్చని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. ఇది దశాబ్దాల్లోనే అత్యల్ప వృద్థి రేటుగా నమోదు కానుందని పేర్కొంది. ప్రపంచ స్థాయిలో వ్యవస్థలు ఆర్థిక పునరుద్ధరణకు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. 2000 నుంచి 2019 మధ్య ప్రపంచ సగటు వృద్థి రేటు 3.8 శాతంగా ఉంది. దీంతో పోల్చితే ఆర్థిక వ్యవస్థలు ఒత్తిడిలోకి జారుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Spread the love