‘వరుణ్‌ బేవరేజెస్‌’లో సీఐటీయూ ఘన విజయం

'వరుణ్‌ బేవరేజెస్‌'లో సీఐటీయూ ఘన విజయం– హెచ్‌ఎంఎస్‌పై చుక్క రాములు గెలుపు
– పట్టణంలో భారీ ర్యాలీ… కార్మికుల సంబరాలు
– ఉద్యోగ భద్రత, కార్మికుల సంక్షేమం కోసం కృషి : సీఆర్‌
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లిలో ఉన్న వరుణ్‌ బేవరేజెస్‌ పరిశ్రమ (పెప్సీ) యూనియన్‌ గుర్తింపు ఎన్నికల్లో సీఐటీయూ ఘన విజయం సాధించింది. శనివారం జరిగిన ఎన్నికల్లో హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు సదానందగౌడ్‌పై సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు 59 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నికల్లో కార్మికులు సీఐటీయూ పక్షాన నిలబడి గెలిపించుకున్నారు. సీఐటీయూకు 129 ఓట్లు రాగా, హెచ్‌ఎంఎస్‌కు 70 ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా కార్మికులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడుతూ.. వరుణ్‌ బేవరేజెస్‌ పరిశ్రమలో 22 ఏండ్ల పాటు సీఐటీయూ విజయఢంకా మోగిస్తూ వచ్చిందని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో మాత్రం హెచ్‌ఎంఎస్‌కు అవకాశమిస్తే రెండేండ్ల కాలంలో కార్మికుల ప్రయోజనాల్ని దెబ్బతీసేలా ఒప్పందాలు చేసిందని విమర్శించారు. కంపెనీ యాజమాన్యం లాభాల కోసం కార్మికుల హక్కులు, సదుపాయాల్ని పణంగా పెట్టి కార్మిక ద్రోహిగా నిలిచిందన్నారు. రెండు దశాబ్దాల పాటు కంపెనీలో కార్మికుల మద్దతుతో గెలుస్తూ వచ్చిన సీఐటీయూ మెరుగైన వేతన ఒప్పందాలు చేసిందన్నారు. కార్మికులకు దక్కాల్సిన చట్టపరమైన హక్కులు, సదుపాయాల్ని సాధించి పెట్టిన చరిత్ర సీఐటీయూకు ఉందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ పరిశ్రమలో యూనియన్‌ గుర్తింపు ఎన్నికలు జరిపేందుకు ప్రయత్నిస్తే.. యాజమాన్యం కుట్రలు చేసి ఎన్నికలు జరగకుండా చేసిందన్నారు. పోలీసు బలగాల్ని మోహరించి కార్మికుల్ని భయభ్రాంతులకు గురి చేసిందన్నారు. కంపెనీ యాజమాన్యం కార్మికుల పట్ల కక్షసాధింపు చర్యలకు పోకుండా సామరస్య పూర్వకంగా సమస్యల్ని పరిష్కరించేం దుకు ప్రయత్నించాలని కోరారు. కార్మికుల శ్రమ ఫలితంగానే కంపెనీల్లో ఉత్పత్తి సాధ్యపడు తుందని, తద్వారానే యాజమాన్యాలు లాభాలు గడిస్తున్నాయని చెప్పారు.
కార్మికుల శ్రమకు తగిన వేతనాలు, ఇతర సదుపాయాల్ని కల్పించాలని సీఐటీయూ కొట్లాడుతోందన్నారు. అందుకే అనేక కంపెనీల్లో కార్మికులు యూనియన్‌ గుర్తింపు ఎన్నికల్లో సీఐటీయూ జెండా వెనకాల ఉంటూ గెలిపిస్తున్నారని చెప్పారు. ఉద్యోగ భద్రత, కార్మికుల సంక్షేమమే సీఐటీయూ లక్ష్యంగా పని చేస్తుందన్నారు. ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.మల్లేశం, జి.సాయిలు, యూనియన్‌ ప్రధాన కార్యదర్శి బాలరాజ్‌, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బాగారెడ్డి, ప్రవీణ్‌కుమార్‌, జిల్లా సహాయ కార్యదర్శి ఎం.యాదగిరి, నాయకులు రవీందర్‌రెడ్డి, భీంరెడ్డి, ప్రేంకుమార్‌, షఫీ, పవన్‌కుమార్‌, మద్దూరు శివకుమార్‌, సుధాకర్‌, సురేష్‌ పాల్గొన్నారు.

Spread the love