ఐదు రోజుల్లో 15.6 మిలియన్ల ఫాలోవర్లు…బీజేపీ, కాంగ్రెస్ లను దాటేసిన కాక్రోచ్ జనతా పార్టీ
సీజేపీకి పోటీగా ఎన్‌పీఎఫ్..సీజేపీ ఎక్స్ ఖాతా నిలిపివేత.. ఇండియాలో జెన్-జీ ఉద్యమం ప్రారంభమైనట్టేనా?
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో/ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
భారతదేశ సోషల్ మీడియా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక వినూత్న డిజిటల్ విప్లవం నడుస్తోంది. కేవలం ఒక కామెంట్ తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అనే రాజకీయ ఉద్యమం, కేవలం ఐదు రోజుల్లోనే బీజేపీ, కాంగ్రెస్ వంటి దేశంలోని అతిపెద్ద అధికారిక రాజకీయ పార్టీల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యను దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో బీజేపీకి సుమారు 8.7 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా, కాంగ్రెస్‌కి 13.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఈ రెండింటిని దాటేసి కాక్రోచ్ జనతా పార్టీ, 15.6 మిలియన్ ఫాలోవర్లతో దూసుకుపోతోంది. ఇటీవల ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, ఉద్యోగాలు లేక సమాజంలో సరైన స్థానం దొరకని కొందరు యువకులు సోమరిపోతులు, బొద్దింకలు, సమాజ పరాన్నజీవులుగా మారిపోతున్నారని, వారంతా జర్నలిస్టులు, ఆర్‌టీఐ కార్యకర్తలు, సోషల్ మీడియా ముసుగులో వ్యవస్థలపై దాడులు చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు.
అయితే దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, అవినీతి, రూపాయి పతనం, ఇంధన ధరలు, ప్రశ్నాపత్రాల లీకేజీల సమస్యలతో ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్న యువతకు ఈ వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. ఇక ఈ వ్యవస్థ తమను బొద్దింకలుగా చూస్తే, ఆ బొద్దింకలన్నీ ఏకమైతే ఎలా ఉంటుందో చూపిస్తామంటూ అభిజీత్ దిప్కే అనే ఓ వ్యక్తి ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ని స్థాపించాడు. ఆయన ఆ పార్టీని స్థాపించి సోషల్ మీడియాలో జాయినైన కొద్ది గంటల్లోనే ఈ పార్టీకి విపరీతమైన మద్దతు లభించింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు, ఎక్స్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియాల్లో ఈ పార్టీ దూసుకుపోతుంది. మరోవైపు దేశంలో నిరుద్యోగం, నీట్ పేపర్ లీకేజీ, పరీక్షల కుంభకోణాలపై యువత నిరసనను తెలియజేయడానికి ఐదు ముఖ్యమైన డిమాండ్లను తెరపైకి తెచ్చింది. న్యాయమూర్తుల పదవీ విరమణ తరువాత ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు కల్పించకూడదని, పార్టీలు మారే ప్రజాప్రతినిధులపై సుదీర్ఘకాలం పాటు ఎన్నికల నిషేధం విధించాలని, తాము కూడా ఆర్‌టిఐ పరిధిలోకి వస్తామని, పార్లమెంటు సీట్ల సంఖ్యను పెంచకుండానే సగం సీట్లను మహిళలకు కేటాయిస్తామని, కేంద్ర క్యాబినెట్‌లో సగం పదవులు మహిళలకు ఇస్తామని పేర్కొంది.
నిజమైన ఓటరు ఓటు హక్కు కోల్పోతే, దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఉపా చట్టం కింద అరెస్టు చేసి విచారణ జరుపుతామని తెలిపింది. అదానీ, అంబానీలకు చెందిన అన్ని మీడియా సంస్థల లైసెన్సులు రద్దు చేస్తామని, గోదీ మీడియా యాంకర్ల బ్యాంకు ఖాతాలపై దర్యాప్తు జరిపిస్తామని, దేశంలో నిజమైన స్వతంత్ర మీడియా పని చేయటానికి బాటలు వేస్తామని పేర్కొంది. తప్పుడు వార్తలు ప్రచారం చేసే మీడియా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ పార్టీ డిమాండ్ చేస్తోంది. అమెరికాలోని బోస్టన్ యూని వర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్‌లో మాస్టర్స్ చేస్తున్న 30 ఏండ్ల భారతీయ విద్యార్థి అభిజీత్ దీప్కే ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)ని ఈ నెల 16న స్థాపించాడు. ‘సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ (సోమరితనం)’ తమ పార్టీ నినాదమని ప్రకటించాడు. తమ పార్టీ యువత కోసం పని చేస్తుందని, ప్రజల సొమ్ము ఎటు పోతుందో నిలదీయటానికి పార్టీ పెట్టామని తెలిపాడు. అంతేకాదు తమ పార్టీకి ఒక రాజ్యాంగం, ప్రత్యేక వెబ్‌సైట్, ఐదు సూత్రాల మ్యానిఫెస్టో కూడా ఉన్నట్టు వెల్లడించాడు.
యమునా నదిలో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు
ఢిల్లీలో ప్రవహిస్తున్న యమునా నది ప్లాస్టిక్ వ్యర్థాలతో కాలుష్యానికి చిరునామాగా మారింది. ప్రభుత్వాలు మారినా యమునా నది దుస్థితి మాత్రం మారలేదు. ఈ క్రమంలో కొందరు యువకులు భుజానికి సంచీలు వేసుకొని యమునా నదిలోని ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరుతూ కనిపించారు. వారి టీషర్టులపై బొద్దింకల గుర్తులతో కూడిన ప్లకార్డులు, కాగితాలు అంటించి ఉండటం పలువురిని ఆకర్షించింది. దీంతో సీజేపీ కార్యకర్తలు అప్పుడే రంగంలోకి దిగారా? అని సోషల్‌మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి.
సీజేపీకి పోటీగా ఎన్‌పీఎఫ్
సీజేపీకి పోటీగా ‘నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్’ (ఎన్‌పీఎఫ్) రంగంలోకి దిగింది. పరాన్నజీవులుగా ముద్రపడిన సామా న్యుల తరపున తాము పోరాడు తామని ఈ పార్టీ ప్రకటించింది. ‘వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడం కోసం ఈ విరిగిపోయిన వ్యవస్థకే తాము అతుక్కు పోతాం’ అంటూ వెబ్‌సైట్‌లో ఎన్‌పీఎఫ్ రాసుకొచ్చింది. పార్లమెంట్‌లో నేరస్తులు ఉండకూడదని, చదువుకున్న ప్రజా ప్రతినిధులు రావాలని, చిన్న వర్షానికి నదులుగా మారే రోడ్లు కనిపించకూడదని పేర్కొంది.
ఈ రెండు పార్టీల్లో చేరికలతో జేఎన్‌జీ ఉద్యమం ప్రారంభమైనట్టేనా?
ఈ రెండు పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన అధికార పార్టీలు కాకపోయినప్పటికీ, దేశంలోని నిరుద్యోగ యువత ఆవేదన, వ్యవస్థపై వారిలో రగులుతున్న అసంతృప్తిని డిజిటల్ వేదికగా చాటి చెప్పడమే సీజేపీ, ఎన్‌పీఎఫ్ పార్టీల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీజేపీ, ఎన్‌పీఎఫ్‌లో చేరుతున్న వారిని చూస్తుంటే దేశంలో ఒక విధంగా జేఎన్‌జీ ఉద్యమం ప్రారంభమైనట్టేనా? అనే అనుమానం కలుగుతున్నదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
సీజేపీ ఎక్స్ ఖాతా నిలిపివేత
సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఎక్స్ ఖాతాను నిలిపివేశారు. అనధికారిక పొలిటికల్ క్యాంపెయిన్ను ప్రారంభించిన వారం రోజుల్లోనే తమ ‘ఎక్స్’ ఖాతాను నిలిపివేశారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తెలిపారు. ఎక్స్ ఖాతా నిలిపివేసే సమయానికి ఆ ఖాతాకు దాదాపు రెండు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతాను నిలిపివేసిన వెంటనే ఆ డిజిటల్ అవుట్ ఫిట్ మరో కొత్త ఖాతాను క్రియేట్ చేసింది. “నిన్న మా ఎక్స్ ఖాతాను హ్యాక్ చేసే ప్రయత్నాలు జరిగాయి. దాంతో ఇలాంటిది ఏదో ఉంటుందని ఊహించాం. ఇప్పుడు మేం ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’ అనే ఎక్స్ ఖాతాను ప్రారంభించాం. ప్రస్తుత పరిణామాలను న్యాయపరంగా పరిష్కరించుకుంటాం” అని అభిజీత్ వెల్లడించారు.



