593 ఐసీటీసీ కేంద్రాలు మూసివేత

– రాష్ట్రంలో 40 హెచ్‌ఐవీ పరీక్షా కేంద్రాల తొలగింపు
– హేతుబద్ధీకరణ పేరుతో మోడీ సర్కార్‌ ఏకపక్ష నిర్ణయం
– ఎయిడ్స్‌ రోగులకు చిక్కులు
–  వెల్లువెత్తుతున్న నిరసనలు
కరోనా సమయంలో దేశంలో వైద్య సేవలు అందక లక్షలాదిమంది మరణించిన విషయం అనుభవంలోనిదే. ఆ ఆపత్కాలం నుంచి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదు. అత్యంత ప్రమాదకరమైన ఎయిడ్స్‌ వ్యాధితో చెలగాటమాడేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 593 హెచ్‌ఐవీ నిర్ధారణ కేంద్రాలను మూసివేయాలని నిర్ణయించింది. ఈ దుష్ప్రభావం భవిష్యత్‌ సమాజంపై తీవ్రంగానే పడుతుందని వైద్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొత్తూరు ప్రియకుమార్‌

పేదలకు అందుతున్న వైద్య సేవలను విస్తరించాల్సి ఉండగా, అందుకు భిన్నంగా హేతుబద్దీకరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం వాటిని మరింత కుదించింది. ఆరోగ్య రంగంలో ఇప్పటికే అనేక పథకాల్లో కోతలు, షరతులు విధించి, పేదల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న విషయం తెలిసిందే. క్షేత్రస్థాయి అవగాహన లేకుండా రోగులు, ప్రజల అభిప్రాయంతో నిమిత్తం లేకుండా తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కేంద్ర సర్కారుపై తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమవుతున్నది. తాజాగా దేశంలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నిర్మూలన కోసం దశాబ్దాలుగా పని చేస్తున్న 593 ఇంటిగ్రేటెడ్‌ కౌన్సిలింగ్‌ అండ్‌ టెస్టింగ్‌ సెంటర్‌ (ఐసీటీసీ)ల మూసివేతకు ఆదేశాలిచ్చింది. వీటన్నింటినీ దశలవారీగా 2024 నాటికి పూర్తిగా మూసివేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫలితంగా రాష్ట్రంలోనూ 40 ఐసీటీసీలు మూసివేతకు గురికానున్నాయి. దీనివల్లో ప్రభుత్వాస్పత్రులపైనే ఆధారపడే లక్షలాది మంది పేద గర్భిణీలు, శస్త్రచికిత్స అవసరమైన రోగులు ఇబ్బందుల పాలవుతారు. హేతుబద్ధీకరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ మూసివేతలకు పాల్పడుతున్నది.
రాష్ట్రంలో 158 ఐసీటీసీ కేంద్రాలున్నాయి. వీటిలో 40 కేంద్రాలను కేవలం స్క్రీనింగ్‌ సైట్లకు పరిమితం చేయడంతో 118 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో పేదలు హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షల కోసం ప్రయివేటును ఆశ్రయించాల్సి వస్తుంది. లేదంటే దూర ప్రాంతాల్లోనే ఐసీటీసీ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని వైద్యరంగ నిపుణులు, ఉద్యోగ సంఘాల నేతలు నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (న్యాకో)తో వాదించినప్పటికీ పరిగణనలోకి తీసుకోలేదు. కేవలం హెచ్‌ఐవీ పాజిటివ్‌ రేషియో తక్కువగా ఉన్న చోట అలాంటి కేంద్రాలను కొనసాగించడంలో హేతుబద్ధత లేదంటూ కొట్టేసింది. అయితే హెచ్‌ఐవీ పాజిటివ్‌ రేషియోతో నిమిత్తం లేకుండా ప్రతి గర్భిణీకి, శస్త్రచికిత్సలు చేయించుకునే వారికి, హైరిస్క్‌ గ్రూప్‌ ఉన్న వారికి ఈ పరీక్షలు రెగ్యులర్‌గా చేయాల్సి ఉంటుందనే కనీస విషయాన్ని విస్మరించింది. ఈ నిర్థారణ జరక్కుంటే వైద్య సేవల సమయంలో వైద్యులకూ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి.
2021 నాటికి రాష్ట్ర జనాభా 3.77 కోట్లు. గడచిన పదేండ్లలో జనాభా పెరుగుదల రేటు 12.45 శాతంగా నమోదైంది. ఏడాదికి ఆరు లక్షల డెలివరీలు జరుగుతున్నాయి. శస్త్రచికిత్సలు, డెలివరీలు గతంతో పోలిస్తే ప్రభుత్వాస్పత్రుల్లో భారీగా పెరిగాయి. ఉన్న ఆస్పత్రులు, పరీక్షా కేంద్రాల్లో రద్దీపెరిగి, వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిపై విపరీతమైన పనిభారాలు పడుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల సంఖ్య పెంచితే, రోగులకూ వైద్యసేవలు లభించడం సులభమవుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇందుకు భిన్నంగా ఉన్నవాటినే మూసివేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. హైదరాబాద్‌ వంటి పట్టణాల్లో వలస కార్మికులు, నిరక్షరాస్యులు, హైరిస్క్‌ గ్రూప్‌, అవగాహనారాహిత్యంతో సురక్షితం కానీ లైంగిక అలవాట్లు కలిగిన వారిలో చైతన్యం తీసుకురావాల్సి ఉన్నది. ఇలాంటి చోట ఉన్న 22 కేంద్రాల్లో 11 కేంద్రాలను తొలగించాలని నిర్ణయిస్తూ కేంద్రం జాబితాను విడుదల చేసింది. దీనికి సంబంధించిన లేఖను ‘న్యాకో’ రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌కు పంపించినట్టు సమాచారం.
హెచ్‌ఐవీ విస్తరించే ప్రమాదం
ఐసీటీసీ కేంద్రాలను మూసివేస్తే హెచ్‌ఐవీ మరింత ప్రబలే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్ప టికే జనాభా ఆధారంగా ఐసీటీసీ కేంద్రాల్లో అనుభవజ్ఞులైన ల్యాబ్‌ టెక్నీషియన్లు మూడు దశల్లో పరీక్షలు చేసి హెచ్‌ఐవీని నిర్ధారిస్తున్నారు. వీరికి తోడు హెచ్‌ఐవీ రాకముందు, హైరిస్క్‌ గ్రూపులకు కౌన్సిలర్లు అవగాహన కల్పిస్తున్నారు. వీరి సేవలు నిలిచిపోతే వ్యాధిబారిన పడే వారి సంఖ్య పెరిగే ప్రమాదముంది.
ఉద్యోగులకూ అన్యాయమే
2000 సంవత్సరంలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం న్యాకోను ఒక కార్యక్రమంగా ముందుకు తెచ్చింది. ఈ పథకం అమలులో భాగంగా రాష్ట్రాల వారీగా ఎయిడ్స్‌ నియంత్రణ మండళ్లను ఏర్పాటు చేసింది. అందులో కొద్ది మంది ఉన్నతాధికారులు తప్ప, వేలాది మంది కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన తక్కువ జీతాలతో పని చేస్తున్నారు. జీతాల పెంపు, సేవల క్రమబద్ధీకరణ కోసం సుదీర్ఘపోరాటం చేస్తున్నారు. ఎయిడ్స్‌ నిర్మూలన పూర్తికాకుండానే ఈ కేంద్రాల్లో పని చేసే ల్యాబ్‌ టెక్నీషియన్లు ఇతరులను ఇంటికి సాగనంపేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోడీ సర్కార్‌ అనాలోచిత చర్యలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.

Spread the love