థియేటర్ల బంద్‌ ఎగ్జిబిటర్ల వ్యక్తిగత నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో రెండు వారాల పాటు సినిమా థియేటర్స్‌లో ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్టు థియేటర్స్‌ యాజమాన్యం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ ప్రకటనపై తెలుగు నిర్మాతల మండలి, తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ స్పందించింది. గుంటూరు ఏరియాతో పాటు ఆంధ్రాలోని మరికొన్ని ప్రాంతాల్లో సినిమా థియేటర్ల యజమానులు గత కొన్ని నెలలుగా తగిన ఆదాయం లేకపోవడంతో డిజిటల్‌ ప్రొవైడర్లకు ఛార్జీలు చెల్లించలేని పరిస్థితిని చూపుతూ తమ సినిమా థియేటర్లను మూసివేసినట్లు మా దష్టికి వచ్చింది. అలాగే ప్రేక్షకులు లేని కారణంగా సినిమా ప్రదర్శన రద్దు చేయడమైనది అని తెలంగాణలో కూడా కొన్ని థియేటర్ల యజమానులు తమ ఇష్టానుసారం బోర్డులు పెడుతున్నారు.
ఈ సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అపెక్స్‌ బాడీస్‌ అంటే తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి సంబంధం లేకుండా ఒక సంఘం సినిమా థియేటర్లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగు చిత్ర నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. సోషల్‌, డిజిటల్‌, ప్రింట్‌ మీడియాలో సినిమా థియేటర్ల మూసివేతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా నుండి ఏ గ్రూప్‌, సినిమా థియేటర్‌ యజమానులు లేదా మరే ఇతర అసోసియేషన్‌ నుండి గాని అపెక్స్‌ బాడీలకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని పునరుద్ఘాటిస్తున్నాను. అందుకే థియేటర్ల బంద్‌ ఫేక్‌ అని తెలియజేస్తున్నాం. తక్కువ వసూళ్లు రావడంతో థియేటర్లను మూసివేసిన కొందరు థియేటర్‌ యజమానులు తీసుకున్న వ్యక్తిగత నిర్ణయం. దీనికి సంబంధించి అన్ని అపెక్స్‌ బాడీస్‌ అంటే తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌కు ఎటువంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేస్తున్నామని ఆయన ప్రసన్నకుమార్‌ అన్నారు. ఇదిలా ఉంటే, థియేటర్ల బంద్‌ ఎగ్జిబిటర్ల వ్యక్తిగత నిర్ణయమని, ఈ నిర్ణయానికి తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షులు సునీల్‌ నారంగ్‌, సెక్రటరీ కె అనుపమ్‌ రెడ్డి తెలిపారు.

Spread the love