హైదరాబాద్‌లో తెలుగు సినిమాకు ఐకాన్‌గా మొట్ట మొదటి స్టూడియోగా శ్రీ సారథీ స్టూడియోస్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అలనాటి సినిమాలు మొదలుకుని, నేటి సినిమాల వరకు ఎన్నెన్నో సినిమాలు ఇక్కడ చిత్రీకరణలు జరుపుకున్నవే. మారుతున్న కాలానికి తగట్టు అధునాతన టెక్నాలజీతో అన్ని రకాల హంగులతో ఈ స్టూడియోస్‌ను తీర్చిదిద్దారు.
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలోనే అధునాతన డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియోలను శ్రీ సారథీ స్టూడియోస్ ప్రారంభించింది. శుక్రవారం ఆహ్లాదభరిత వాతావరణంలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో డాల్బీ మిక్సింగ్ స్టూడియోను సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ప్రారంభించగా, సౌండ్ డిజైన్ స్టూడియోను సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర ఆరంభించారు.
ఈ సందర్భంగా శ్రీ సారథీ స్టూడియోస్ చైర్మన్ ఎం.ఎస్ ఆర్.వి. ప్రసాద్ మాట్లాడుతూ, ‘మా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మా స్టూడియోలో మొదలైన మొదటి సినిమా ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం’ అని అన్నారు.