అజయ్ ఘోష్, చాందినీ చౌదరిలు ప్రముఖ పాత్రలు పోషించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఈ సినిమాను ఫ్లై హై సినిమాస్ బ్యానర్ మీద హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. శివ పాలడుగు ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్ర టీజర్‌ను శనివారం రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌లో అజరు భూపతి ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్రయూనిట్‌ను అభినందించారు. భాను చందర్ మాట్లాడుతూ,’ఇదొక కాన్సెప్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా. ఇందులో నేను హీరోయిన్ ఫాదర్‌గా నటించాను. ప్రస్తుతం పిల్లలకు, తల్లిదండ్రులకు బాగా గ్యాప్ ఉంది. ఈ మూవీలో అది చక్కగా చూపించారు’ అని తెలిపారు. ‘ఇందులో ఒక జీవితం కనిపిస్తుంది. మన జీవితాల్లో మనం ఏమేం కోల్పోయి ఏ స్థితిలో ఉన్నామో చెబుతుంది. ఇందులో నేను హీరో కాదు. కథే హీరో. మా దర్శకుడు శివ చాలా మంచి కథను రాసుకున్నాడు. ఇది చాలా మంచి చిత్రం అవుతుంది’ అని అజరు ఘోష్ అన్నారు. చాందినీ చౌదరి మాట్లాడుతూ, ‘ఈ సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. ఇందులో భిన్న మనస్తత్వాలున్న రెండు పాత్రల ప్రయాణం అందరినీ ఆకట్టుకుంటుంది. విజువల్స్, మ్యూజిక్ బాగుంటాయి’ అని చెప్పారు. ‘బడ్జెట్ పెరిగినా ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతోనే పూర్తి చేశాం. ఈ సినిమా ప్రేక్షకులందరికీ కనెక్ట్ అవుతుంది’ అని నిర్మాత హర్ష గారపాటి తెలిపారు. దర్శకుడు శివ పాలడుగు మాట్లాడుతూ,’నన్ను నమ్మి ఈ కథను ఒప్పుకున్న అజరు ఘోష్‌కి, సినిమాను నిర్మించిన నిర్మాతలకు థ్యాంక్స్’ అని అన్నారు.