ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సీఎం సిద్ధం

– ఎంప్లారు హెల్త్‌ స్కీం అమలుకు ఉద్యోగులు, పెన్షనర్లతో ప్రత్యేక కమిటీ :మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారని మంత్రి టి హరీశ్‌రావు అన్నారు. టీఎన్జీవో కేంద్రసంఘం గౌరవాధ్యక్షులు దేవీప్రసాద్‌ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు శుక్రవారం డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో హరీశ్‌రావును కలిశారు. ఎంప్లారు హెల్త్‌ స్కీమ్‌, ఇతర సమస్యల గురించి మంత్రి దృష్టికి వారు తెచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లారు ఫ్రెండ్లీగా ఖ్యాతి గడించిందని అన్నారు. ఎంప్లారు హెల్త్‌ స్కీంను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ఉద్యోగు లు, పెన్షనర్ల ప్రతినిధులు సభ్యులుగా ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ స్కీమ్‌ ద్వారా అత్యున్నత వైద్య సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా అందుబాటు లోకి వస్తాయన్నారు. ఉద్యోగులకు అత్యధిక వేతనాలు, పెన్షన్లు అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధుల విడుద లలో మొండిగా ప్రవర్తిస్తున్నప్పటికీ సీఎం కేసీఆర్‌ రాష్ట్రాభి వృద్ధి, సంక్షేమంపై చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని వివరించారు. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ స్టేట్‌ గౌట్‌ రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ప్రెసి డెంట్‌ దామోదర్‌రెడ్డి, జనరల్‌ సెక్రెటరీ చంద్రశేఖర్‌, ట్రెజరర్‌ గంగారెడ్డి, పెన్షనర్ల జేఏసీ చైర్మెన్‌ లక్ష్మయ్య, పూర్ణ చందర్‌ రావు, నర్సింగ్‌రావు, ఎల్‌ శ్రీనివాస్‌ రెడ్డి ఇతర సభ్యులున్నారు.

Spread the love