మహారాష్ట్రలో సీఎం కేసీఆర్‌ రెండ్రోజుల పర్యటన

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు రెండ్రోజులు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. సోమ, మంగళవారాల్లో ఆయన ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పండరీపూర్‌, తుల్జాపూర్‌ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. షోలాపూర్‌లో పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయన వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గాన హైదరాబాద్‌ నుంచి మహారాష్ట్రకు వెళ్తారు. సాయంత్రానికి షోలాపూర్‌ చేరుకుని అక్కడే బస చేస్తారు. ఈ సందర్భంగా షోలాపూర్‌కు చెందిన భగీరథ్‌ బాల్కే సహా పలువు రు నేతలు కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. అలాగే సీఎం కేసీఆర్‌ అక్కడి చేనేత కార్మికుల కుటుంబాలను కూడా కలుస్తారని పార్టీ వర్గా లు తెలిపాయి. మంగళవారం ఉదయం పండరీపూర్‌కు చేరుకొని అక్కడి విఠో భారుక్మిణి మందిర్‌లో ప్రత్యేక పూజలు చేస్తారు. దారాశివ్‌ జిల్లాలోని శక్తిపీఠ మైన తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకుంటారు.. అక్కడి నుంచి మళ్లీ రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు తిరిగి వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
కారెక్కిన ఎన్సీపీ నేత ఆరిఫ్‌ ఆజ్మీ
మహారాష్ట నుంచి బీఆర్‌ఎస్‌లో చేరికలు కొనసాగుతున్నాయి. భీవండి నుంచి ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన పలువురు నేతలు బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు, సీఎం కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఆదివారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్సీపీ మైనార్టీ విభాగం జాతీయ కార్యదర్శి అరిఫ్‌ అజ్మీ, ఫజిల్‌ అన్సారీ, భీవండి కాంగ్రెస్‌ నేత, సామాజిక కార్యకర్త ఇర్ఫాన్‌ మోమిన్‌, కాంగ్రెస్‌ నేత, ఎన్జీవో సీనియర్‌ నేత అర్ఫత్‌ షేక్‌, ఎన్సీపీ థానే జిల్లా ఉపాధ్యక్షులు మక్సూద్‌ఖాన్‌ తదితరులు చేరారు. ఎమ్మెల్యే ఏ. జీవన్‌రెడ్డి, మహారాష్ట బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Spread the love