రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

నవతెలంగాణ హైదరాబాద్‌: రైతుభరోసా(గతంలో రైతుబంధు), పింఛన్లపై అపోహలకు గురి కావద్దని.. పాత లబ్ధిదారులకు యథావిధిగా ఈ పథకాలు అందుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కొత్తగా కావాలనుకునేవారు మాత్రమే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురికావద్దని తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తుల సరళి, క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రిలతో  సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తుదారులు వ్యక్తం చేస్తున్న సందేహాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. ప్రజాపాలన దరఖాస్తులో కుటుంబ వివరాలతోపాటు అభయహస్తం గ్యారంటీ పథకాల వివరాలు ఇచ్చారు. అయిదు పథకాల్లో కావాల్సిన వాటిని టిక్‌ చేయడంతోపాటు ఆ వివరాలు నింపాల్సి ఉంటుంది.

అర్జీదారుల్లో నెలకొన్న సందేహాలు

  • ఇప్పటికే రైతుబంధు(ఇప్పుడు రైతుభరోసా) పొందుతున్నాం.. ప్రజాపాలన దరఖాస్తులో రైతుభరోసా కావాలంటే పట్టాదారు పాసుపుస్తకం నంబర్లు, సాగుచేస్తున్న భూమి వివరాలు అడుగుతున్నారు.. ఆ సమాచారమంతా మళ్లీ ఇవ్వాలా?
  • దరఖాస్తులో చేయూత పథకం కింద.. వృద్ధాప్య, వితంతు, చేనేత, బీడీ కార్మికులు సహా పది రకాల పింఛన్లు, దివ్యాంగ పింఛన్ల బాక్సులు ఇచ్చారు. ఇప్పటికే పింఛను పొందుతున్నాం.. మరోసారి దరఖాస్తు చేయాలా? లేదంటే పింఛను, రైతుభరోసా రావా?     ఈ విషయాలన్ని సమీక్షలో ప్రస్తావనకు రావడంతో పాత లబ్ధిదారులకు పథకాలు యథాతథంగా అందుతాయని రేవంత్‌రెడ్డి అధికారులకు స్పష్టంగా చెప్పారు. ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైనన్ని అర్జీలు అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారుల్ని ఆదేశించారు.
Spread the love