తమ్మినేనికి సీఎం రేవంత్‌ పరామర్శ

To my sister CM Revanth Paramarshaనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య వివరాలను అడిగి సీఎం తెలుసుకున్నారు. ఏఐజీ ఆస్పత్రి చైర్మెన్‌ నాగేశ్వర్‌ రెడ్డి, ఇతర వైద్యులని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. వాటి పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. తమ్మినేని త్వరగా కోలుకోవాలనీ, ప్రజాక్షేత్రంలోకి తిరిగి రావాలని రేవంత్‌ రెడ్డి ఆకాంక్షించారు. ఈ సమయంలో పలు రాజకీయ, ఇతర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసినప్పుడు ఇచ్చిన విజ్ఞాపన పత్రంలోని సమస్యల పరిష్కారం ఎంత వరకు వచ్చిందని తమ్మినేని ప్రస్తావించారు. వాటిని పరిష్కరిస్తామంటూ సీఎం హామీ ఇచ్చారు. అయితే రాష్ట్రంలో తమ్మినేని చేపట్టిన మహాజన పాదయాత్రలో పాల్గొన్నట్టు గత స్మృతులను రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు.
ఏఐజీ ఆస్పత్రిని సందర్శించిన వారిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీపీఆర్వో అయోధ్యరెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌, ఖమ్మం జిల్లా నాయకులు నవీన్‌, తమ్మినేని కుమారుడు సంఘమిత్ర తదితరులు ఉన్నారు. గురువారం ఆయనకు మైనర్‌ ఆపరేషన్‌ చేసి గుండె వద్ద పేస్‌ మేకర్‌ను డాక్టర్లు అమర్చారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందనీ, సాధారణ స్థితికి చేరుకుంటున్నారని వారు వివరించారు.

Spread the love