Tuesday, June 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవర్షాల కారణంగా సీఎం ఖమ్మం పర్యటన వాయిదా

వర్షాల కారణంగా సీఎం ఖమ్మం పర్యటన వాయిదా

- Advertisement -

​నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
​ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ, ప్రజా కార్యక్రమాలను మెచ్చి వరణుడు కరుణించాడని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. వర్షాల నేపథ్యంలో సీఎం ఖమ్మం పర్యటన వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. రైతు భరోసా పంపిణీ అనంతరం రైతు ఆశీర్వాద సభ ఉంటుందన్నారు. చింతకాని మండలం జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభా ప్రాంగణాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌‌తో కలిసి డిప్యూటీ సీఎం సోమవారం పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు మాట్లాడారు. వాతావరణ పరిస్ధితులు, వర్షాల కారణంగా ఈ నెల 30న ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ రోడ్, జగన్నాథపురం గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యే రైతు ఆశీర్వాద సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో సభా ప్రాంగణం పూర్తిగా బురదమయంగా మారిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లక్షలాది మంది రైతుల సమక్షంలో సభ నిర్వహించడం సాధ్యం కాదన్నారు. రైతు భరోసా పంపిణీ పూర్తయిన అనంతరం మరింత వైభవంగా ‘రైతు ఆశీర్వాద సభ’ పేరుతో ముగింపు వేడుక నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం జిల్లాలో జులై 3 లేదా 4వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరో వారం రోజుల వాతావరణ పరిస్థితులను సమీక్షించి, అనుకూలిస్తే జులై 6 లేదా 7, 8వ తేదీల్లో సభ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో ఏర్పాట్లు కొనసాగిస్తున్నట్టు తెలిపారు.
​వర్షం అడ్డపడినా భరోసా ఆగదు : మంత్రి తుమ్మల
రైతు ఆశీర్వాద సభకు వర్షం అడ్డుపడినా రైతు భరోసా నిధుల విడుదల మాత్రం యథావిధిగా కొనసాగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వానాకాలం సాగు దృష్ట్యా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు భరోసా నిధుల విడుదలకు సీఎం సిద్ధంగా ఉన్నారని, మంగళవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకం నిధులను విడుదల చేస్తారని వెల్లడించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. రైతు భరోసా, రుణమాఫీ అంశాలపై ప్రతిపక్ష నాయకులు అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పదేండ్లలో రైతుబంధు కింద రూ. 72 వేల కోట్లు ఇవ్వగా, ప్రజా ప్రభుత్వం కేవలం రెండున్నరేండ్లలోనే రైతు భరోసా ద్వారా రూ. 36 వేల కోట్ల సాయం అందించిందని తెలిపారు. యూరియా యాప్ ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు అందుతున్నాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్‌ రాయల నాగేశ్వరరావు, ఆర్ అండ్ బీ ఎస్ఈ యాకూబ్, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసాచారి, పీఆ‌ర్‌ఎస్ఈ వెంకట్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి విజయ చందర్, డీఆర్డీవో శ్రీరామ్, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సునీల్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -