అబ్జర్వర్ తో కలిసి సీఎంసీలో కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, సీపీ

నవతెలంగాణ – డిచ్ పల్లి
పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు సంబంధించి సీఎంసీ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, ఈ మేరకు కౌంటింగ్ కోసం చేపడుతున్న ఏర్పాట్లను ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలిస్ వజ్ ఆర్ తో కలిసి  కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనవార్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, ఇతర సహాయ రిటర్నింగ్ అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుతో పాటు నిజామాబాద్ అర్బన్, రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కూడా సీఎంసీలోనే చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ సెంటర్లను, ఆయా సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు గదులు, పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ ల  వద్ద చేపట్టిన ఏర్పాట్ల గురించి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అబ్జర్వర్ కు వివరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి, అభ్యర్థులు, ఏజెంట్ల రాకపోకల కోసం వేర్వేరు మార్గాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ హాళ్ల వద్ద సీ.సీ కెమెరాల ఏర్పాటు, తాగునీరు, విద్యుత్, కౌంటింగ్ టేబుల్స్, కౌంటర్లు, ఇతర సదుపాయాలకు సంబంధించి కొనసాగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రంతో పాటు పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండాలని, తుది దశకు చేరిన పనులను వేగవంతం చేసి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ట్రైనీ కలెక్టర్ సాకేత్, ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, కార్మిక శాఖ అధికారి యోహాన్, మెప్మా పీ.డీ రాజేందర్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
Spread the love