రాజన్నను దర్శించుకున్న  కమిషనర్..

– గోశాలను సందర్శించిన కమిషనర్.
– విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు..
– దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతు రావు..
నవతెలంగాణ – వేములవాడ 
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం జన్మ జన్మల అదృష్టమని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతు రావు అన్నారు.  మంగళవారం దేవాదాయ శాఖ, పౌరసంబంధాల శాఖ కమిషనర్ హనుమంతు రావు వేములవాడ ఆలయాన్ని సందర్శించి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి విచ్చేసిన సమాచార పౌర సంబంధాల శాఖ,  దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ హనుమంతరావు కు వేద పండితులు వేద మంత్రాలు, ఆశీర్వాదాలు తో పూర్ణకంభ స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం స్థల పురాణాన్ని వివరించారు. స్వామి వారి కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులు వేదొక్త ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ డి.కృష్ణ ప్రసాద్ శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం, చిత్రపట్టం అందజేశారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతు రావు మాట్లాడుతూ చాలా సంవత్సరాల తర్వాత వేములవాడ  శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకునే అదృష్టం లభించిందని,  గతంలో ఈ ప్రాంతంలో పని చేసే సమయంలో స్వామి దర్శనం చేసుకున్నానని, మళ్ళీ చాలా రోజుల తర్వాత దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు ఆలయంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించి, అదేవిధంగా ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం జరిగిందని అన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం సైతం అంగరంగ వైభవంగా విజయవంతంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. వేములవాడ ఆలయంలో సైతం మహాశివరాత్రి వేడుకలను భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిర్వహించామని అన్నారు. కోడే మొక్కల చెల్లింపులో భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులు, జరుగుతున్న ఒక తోకల నిర్మూలనకు అవసరమైన పటిష్ట చర్యలు తీసుకుంటామని, వేములవాడ ఆలయంలో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన దిశగా కృషి చేస్తామని అన్నారు. అనంతరం వేములవాడ దేవస్థానానికి సంబంధించిన  గో శాలను సందర్శించిన కమిషనర్ గోవుల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వేములవాడ గోశాలలో మొత్తం 1000 పైగా కోడెలు, 98 ఆవులు ఉన్నాయని తెలిపారు. గోశాలల నుంచి ఇచ్చే  జంతువులకు తప్పనిసరిగా  ట్యాగ్ ఏర్పాటు చేయాలని, వాటిని ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేయాలని అన్నారు. గోశాల జంతువులను అమ్మకం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వేసవి కాలం దృష్ట్యా గోవులకు ఎండ తీవ్రత కలగకుండా నీడ కొరకు చలువ పందిర్లు, మంచినీరు వాటికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఆలయ ప్రాంగణం, గోశాల పూర్తి స్థాయిలో పందిర్లు వేయాలని అన్నారు.   గోశాల నుంచి ఆవులను రైతులకు అప్పగించే సమయంలో నిబంధనలు పాటించాలని, ట్యాగింగ్ తప్పనిసరిగా చేయాలని అన్నారు. గోవుల బాగోగుల వివరాలను జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి నుంచి అడిగి తెలుసుకున్నారు.  పశువులకు వచ్చే వ్యాధులు, వాటికి అవసరమైన వ్యాక్సినేషన్ ప్రతి పశువుకు అందేలా చూడాలని అన్నారు. పశువులకు కేటాయించిన దాణా సరిగ్గా వేయాలని, పశువులు చూస్తే చాలా చాలా నీరసంగా కనిపిస్తున్నాయని, వారం రోజు లో పరిస్థితి మార్పు రావాలని, తౌడు, దాణా సరిగ్గా లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.  పశుసంవర్థక శాఖ వైద్యులు నిరంతర పర్యవేక్షణ చేయాలని అన్నారు. పశువుల అంశంలో ఎటువంటి అవకతవకలకు పాల్పడిన విజిలెన్స్ విచారణ చేపట్టి అవసరమైన కేసులు నమోదు చేయడం జరుగుతుందని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆయన ఆదేశించారు.  కమిషనర్ వెంట ఏఈఓలు సంకపల్లి హరి కిషన్, జయ కుమారి, బ్రహ్మన్న గారి శ్రీనివాస్, ప్రతాప్ నవీన్, ఈఈ రాజేష్, డీఈ రఘునందన్, ఏఈ శేఖర్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీ రాములు, తిరుపతి రావు, ఆలయ ఇన్స్ పెక్టర్ చెక్కిళ్ళ అశోక్, ఎడ్ల శివ సాయి, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి వి.శ్రీధర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love