– ఈ నెల 21న కమిటీ మూడో భేటీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యా లను పరిశీలిస్తున్న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ తుది దశలో ఉన్న తన నివేదికను వచ్చే లోక్‌సభ ఎన్నికలలోపు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని యోచిస్తోంది. ‘ఫిబ్రవరి లేదా మార్చిలో ఎప్పుడైనా నివేదిక సమర్పించే అవకాశముంది’ అని కమిటీ సభ్యులు తెలిపారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానంపై ఉన్నత స్థాయి కమిటీ (హెచ్‌ఎల్‌సీ) ముందున్న ప్రధాన కర్తవ్యం – నివేదికను ఖరారు చేయడంలో ఎన్నికల సంఘం (ఈసీ), రాజ్యాంగ న్యాయస్థానాల మాజీ న్యాయమూర్తులు, ప్రముఖ న్యాయనిపుణులు, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజలు, 22వ లా కమిషన్ వివిధ భాగస్వాముల నుంచి వచ్చిన సూచనలను చేర్చడమని చెప్పారు.
హెచ్‌ఎల్‌సీ ఇప్పటికే సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది. మద్రాస్ హైకోర్టు
మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మునీశ్వర్ నాథ్ భండారీని చైర్‌పర్సన్ కోవింద్ ఢిల్లీలో బుధవారం కలిశారు. అలాగే ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొర్ల రోహిణి, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్రతో గురువారం చర్చించారు. జనవరి 15 వరకు కమిటీకి ప్రజల నుంచి ఈమెయిల్‌ల ద్వారా 15,000, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వెబ్‌సైట్ ద్వారా మరో 12,000 ప్రతిస్పందనలు అందాయి. దాదాపు 70 శాతం మంది ప్రతిస్పందనదారులు ఏకకాల పోల్స్ ఆలోచనను సమర్థించారని తెలిపారు. ప్యానెల్ తన సూచనల కోసం ఈసీని కూడా సంప్రదించిందని, అయితే దానికి ఇంకా స్పందన రాలేదన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన రెండో సమావేశం తరువాత లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో మూడంచెల ఎన్నికలను నిర్వహించడంపై తమ సూచనలను కోరుతూ ఆరు జాతీయ పార్టీలు, 33 రాష్ట్ర పార్టీలకు కమిటీ లేఖ రాసిన విషయం తెలిసిందే. సూచనల సమర్పణకు గడువు గురువారంతో ముగిసింది. సీపీఐ(ఎం), సీపీఐ, డీఎంకే, టీఎంసీ, ఎంఐఎం, నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) వంటి అనేక పార్టీలు కమిటీకి సమర్పించిన ఆయా పార్టీల సూచనలలో జమిలి ఎన్నికల ప్రతిపాదనను వ్యతిరేకించాయి. కాంగ్రెస్ కూడా ఏకకాలంలో ఎన్నికలను వ్యతిరేకించింది. బీజేపీ, దాని మిత్రపక్షాలు కమిటీకి ఎటువంటి అధికారిక అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. అయితే గతంలో ఈ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా మద్దతు ఇచ్చాయి.
జనవరి 21న కమిటీ మూడో భేటీ
ఇదిలా ఉండగా, ఆదివారం కోవింద్ ఆధ్వర్యంలో హెచ్‌ఎల్‌సీ మూడో అధికారిక సమావేశాన్ని నిర్వహించే అవకాశముంది. గతేడాది సెప్టెంబర్‌లో కేంద్రం ఏర్పాటుచేసిన కమిటీ గతంలో సెప్టెంబర్ 23, అక్టోబర్ 25 తేదీల్లో సమావేశమైంది.
మేం వ్యతిరేకం : మల్లికార్జున్ ఖర్గే
ఒకే దేశం, ఒకే ఎన్నిక అప్రజాస్వామ్యమని, ఆ ఆలోచన రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి వ్యతిరేకమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ అనే ఆలోచనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామనీ, ఇది ఫెడరలిజం హామీలకు విరుద్ధమైన అప్రజాస్వామిక ఆలోచన అని చెప్పారు. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’పై కేంద్రం ఉన్నత స్థాయి కమిటీ కార్యదర్శి డాక్టర్ నితిన్ చంద్రకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నాలుగు పేజీల లేఖను రాశారు.
‘రాజ్యాంగం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని తారుమారు చేసేందుకు మాజీ రాష్ట్రపతి పదవిని దుర్వినియోగం చేయొద్దొ’ అని ప్యానెల్ చైర్‌పర్సన్ కోవింద్‌ను కోరారు. ఈ కమిటీలో ప్రతిపక్షానికి తగిన ప్రాతినిధ్యం లేదని అన్నారు. కమిటీలో వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చోటు కల్పించలేదనీ, ఈ విషయంలో పక్షపాత ధోరణి అవలంబించారని విమర్శించారు. వన్ ఎలక్షన్ అనే ఆలోచనను ఉన్నత స్థాయి కమిటీ ఇప్పటికైనా విరమించుకోవాలని, దీనికి సంబంధించి ఏర్పాటైన హైపవర్ కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. ఒకే ఎన్నికలంటూ బీజేపీ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తోందని ఖర్గే ఆరోపించారు. రాజకీయ పార్టీల నిధుల విషయంలో పారదర్శకత పాటించాలని కోరారు.