కష్టజీవులకు అండ కమ్యూనిస్టులే…

రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. అధికారం కోసం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు నువ్వానేనా? అన్నట్టు తలపడుతు న్నాయి. నేనున్నానని చెప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. గత ఐదేండ్లుగా రాష్ట్ర ప్రజలు కమ్యూనిస్టులు లేని శాసనసభను చూసారు. ఎర్రజెండా ప్రతినిధులు లేని లోటు స్పష్టంగా కనిపించింది.
శాసనసభ ప్రజాసమస్యలు చర్చించి పరిష్కార మార్గం వెతికే వేదిక కావాలి. ప్రభుత్వ విధానాల మీద లోతైన, విమర్శనాత్మక చర్చ జరగాలి. శాసన సభకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి. తెలం గాణ శాసనసభకు జరిగిన తొలి ఎన్నికల తర్వాత, శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్ళిన సీపీఐ(ఎం) నాయకత్వ బృందంతో మాట్లాడుతూ, శాసనసభలో సుందరయ్య నెలకొల్పిన సంప్రదాయం పునరుద్ధరి స్తానని కేసీఆర్‌ అన్నారు. కానీ తర్వాత అందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. గత ఐదేండ్లలో ప్రజా ప్రయోజనాల ఊసే నామమాత్రమైంది. స్వార్థ రాజకీయ, వ్యక్తిగత ప్రయోజ నాలే ప్రధానమవుతున్నాయి. ఒకప్పుడు 30-40 రోజులు జరిగే బడ్జెట్‌ సమావేశాలు కూడా పట్టుమని పదిరోజులు కూడా జరగటంలేదు. తంతుగా మారింది. పదవులు, సంపాదనే లక్ష్యా లుగా ఫిరాయింపులు సర్వ సాధారణమైనాయి. పదవుల కోసం ఏ గడ్డి గరవడానికైనా సిద్ధపడే ధోరణి బలపడింది. విలువల వలువలూడుతున్న కాలం. కోట్లు ఖర్చు చేయగల్గినవారే పోటీ చేయగలరన్న స్థితి ఏర్పడింది. పేదలపక్షం నిలబడే కమ్యూని స్టులకు ఇది పెద్ద ఆటంకం. ఫలితంగా ప్రజల పట్ల నిబద్ధత లేనివారు వ్యాపార ప్రయోజనాల కోసం శాసన సభ్యులవుతు న్నారు. అధికార, ప్రతిపక్ష శాసనసభ్యుల మధ్య పరస్పర నిందా రోపణలు, తిట్ల దండకాలకు శాసనసభ వేదికగా మారింది. వ్యక్తిగత విషయాలు బజారుకీడ్చే బజారు రాజకీయాలు నడు స్తున్నాయి. అధికార, ప్రతిపక్షాలన్న తేడా లేదు. ప్రతిపక్షం బలం గా ఉంటేనే ప్రజాస్వామ్యం బతుకుతుందని తొలి ప్రధాని జవ హర్‌లాల్‌ నెహ్రూ అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతిపక్షం తన పాత్ర పోషించాలన్నా కమ్యూనిస్టులు ఉండాలి. అందుకే ఈసారి ప్రజలు తమ అభ్యర్ధులను శాసనసభకు పంపాలని సీపీఐ(ఎం) కోరింది.
సహజంగానే కమ్యూనిస్టులు పేదల పోరాటాలకు అండగా ఉంటారు. నిరంతరం పేదల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారు. ఏడాదిన్నర కాలంగా, 19 జిల్లాలలో, 69 కేంద్రాలలో లక్షకు పైగా కుటుంబాలు ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకున్నారు. పట్టాల కోసం, ఇంటి నిర్మాణానికి సహాయం కోసం, డబల్‌ బెడ్రూం ఇండ్ల కోసం సీపీఐ(ఎం) నాయ కత్వంలో పోరాడుతున్నారు. అంతేకాదు… మహబూబా బాద్‌లో శంకర్‌ నాయక్‌, వరంగల్‌ తూర్పులో నరేందర్‌ లాంటి శాసనసభ్యులు బహిరంగంగానే పేదల మీద దాడులు చేస్తున్నప్పటికీ, గుడిసెవాసులకు ఎర్రజెండానే అండగా ఉన్నది. ఈ కాలంలో జరిగిన వివిధ రంగాల కార్మిక పోరాటాలలో అత్యధికం కమ్యూ నిస్టుల అండతోనేనన్న విషయం కూడా తెలి సిందే. బహుశా అందుకే ఇతర పార్టీలకు సీపీఐ(ఎం) మీద గుర్రుగా కూడా ఉండవచ్చు. కమ్యూనిస్టు శాసనసభ్యులే ఉంటే పోరాడే ప్రజ లకు మరింత అండ దొరుకుతుంది. ప్రజా ఉద్య మాన్ని బలపరచే అభ్యర్ధులను ఎన్నుకోవటం అవసరం. అంతేకాదు… ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, చివరకు ధర్నాచౌక్‌ రక్షణ కోసం కూడా కమ్యూనిస్టులే పోరాడవల్సి వచ్చింది కదా!
బెంగాల్‌లో 34ఏండ్ల పాలన తర్వాత లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఓడి పోయిన సందర్భంగా మీడియాలో విస్తృతంగా చర్చ జరి గింది. కమ్యూనిస్టు వ్యతిరేకులతో సహా ఎవ్వరూ ఆ ఫలి తాలను జీర్ణించుకోలేకపోయారు. కమ్యూనిస్టులు బలహీన పడటం దేశానికి నష్టమని బహిరంగంగానే చెప్పారు. జాతీయ పత్రికలు విశ్లేషణలు కూడా చేసాయి. కమ్యూనిస్టులు బలంగా ఉన్నపుడే ఇతరులు కూడా, ఎంతోకొంత పేదల కోసం పని చేస్తారన్నారు. కమ్యూనిస్టులు బలహీనపడితే పేదల సమ స్యలు పట్టించుకునే వారుండరనీ, విలువలు దిగజారుతా యనీ ఆవేదన చెందారు. ఇప్పుడదే జరుగుతున్నది. ఆర్థిక వ్యవస్థను బలంగా నిలిపిన ప్రభుత్వరంగ సంస్థలు, ప్రజా స్వామ్యం, జాతీయ సమగ్రత, మత సామరస్యం, లౌకిక విలు వలు, రాష్ట్రాల హక్కులు ఈమాత్రమైనా ఉన్నాయంటే మూడు రాష్ట్రాలలో వామపక్ష ప్రభుత్వాలు, బలమైన కమ్యూనిస్టు ఉద్యమం ఉండటమే కారణమని నిర్ధారించారు. ప్రజానుకూల విధానాల ప్రాతిపదికమీద అనేక పార్టీలు కలిసి ఐక్య సంఘ టన ఏర్పడితే సుదీర్ఘ కాలం సుస్థిర పాలన అందించవచ్చని కూడా వామపక్ష ప్రభుత్వాలు రుజువు చేసాయి. మెరుగైన ప్రత్యామ్నాయ విధానాలు ఆచరించి చూపాయి. ఇప్పటికీ దేశా నికి కేరళ వామపక్ష ప్రభుత్వం వేగుచుక్కగా నిలిచింది. అందుకే మన రాష్ట్ర శాసనసభలో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం అవసరం.
ఆర్థిక అసమానతలు, పేదరికం ఉన్న దేశంలో సంక్షేమ పథకాలు అనివార్యం. కానీ ఆ పేరుతో ప్రజలను మభ్యపెట్టి, అధికారం చేపట్టగానే పట్టించుకోకపోవటం అలవాటుగా మారింది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథ కాలు అమలు జరిపినప్పటికీ, పేదల జీవితాలమీద దీర్ఘకాలిక ప్రభావం చూపే దళితులకు మూడెకరాల సాగుభూమి, ఖాళీ పోస్టుల భర్తీ, కేజీ టు పీజీ ఉచిత విద్య, నిరుద్యోగ భృతి, ఇండ్లు, ఇండ్లస్థలాలు వంటి వాగ్దానాలు అమలు చేయలేదు. కాంగ్రె సైనా, బీఆర్‌ఎస్‌ అయినా వీటిని ఓట్ల పథకాలుగా మార్చి వేసారు. ఇక బీజేపీకి సంక్షేమ పథకాలే గిట్టవు. మతాన్ని ప్రయో గించి ఓట్లు దండుకోవచ్చని వారి నమ్మకం. అందుకే ఉచితాల పేరుతో సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా బీజేపీ నాయకుడే కేసు వేసారు. మోడీ ప్రభుత్వం కూడా దానినే సమర్ధించింది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెలంగాణలో కూడా బలపడాలని ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం అడ్డదారులు తొక్క డానికి వెనుకాడటం లేదు. బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు తెర లేపింది. బీఆర్‌ఎస్‌ శాసనసభ్యులను టోకుగా కొనుగోలు చేసి, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నిందని రాష్ట్ర ప్రభుత్వం బట్టబయలు చేసింది. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ఎరవే స్తున్నది. తానే బీసీనన్న మోడీ, ప్రధానమంత్రి అయి కూడా కులగణనను ఎందుకు నిరాకరిస్తున్నారో జవాబు లేదు. దేశంలో కార్మిక చట్టాలు రద్దు చేసారు. మూడు రైతు వ్యతిరేక చట్టాలు రుద్దేందుకు విఫలయత్నం చేసారు. ప్రజలమీద ధరాభారం మోపారు. ఆర్టీసీని ధ్వంసం చేసే విధంగా కేంద్రంలో రవాణా సవరణ చట్టం చేసారు. నిరుద్యోగం, మహిళలమీద దాడులు, కుల దురహంకార దాడులు మోడీ పాలనలో పరాకాష్టకు చేరా యి. ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలన్న వాగ్దానం గాలికొదిలే సారు. అవినీతిని చట్టబద్ధం చేసారు. అదానీ, అంబానీల ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలు పణంగా పెడుతు న్నారు. సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మత పరమైన విభజనను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ఈ మధ్యనే రాష్ట్రంలో ఒక బహిరంగసభలో మాట్లాడుతూ, ఇక్కడ తాము అధికారంలోకి వస్తే ముస్లిం బీసీ రిజర్వేషన్లు రద్దు చేసి, హిందు వులలోని బీసీలకు పంచుతామని కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా రెచ్చగొట్టారు. బండి సంజరు పాదయాత్రను చార్మినార్‌ దగ్గర వివాదాస్పద స్థలం నుంచి ప్రారంభించారు. సికిందా బాద్‌ నుంచి తిరుపతికి వందేభారత్‌ రైలు ప్రారంభిస్తూ ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. బీజేపీ శాసనసభ్యుడు ప్రముఖ కళాకారుడి ప్రదర్శన విషయంలో మతపరమైన రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేసారు. సినీరంగంలోని మహిళల వ్యక్తిగత జీవి తాల గురించి అవమానకరంగా మాట్లాడారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా మతపరమైన భావోద్వేగాలు సృష్టించి ఓట్లు దండుకున్నారు. త్వరలో రజాకార్‌ ఫైల్స్‌ పేరుతో సినిమా విడు దల చేసి మతచిచ్చు రేపే ప్రయత్నంలో ఉన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని వక్రీకరిస్తున్నారు.
రాష్ట్రంలో సున్నిత పరిస్థితులు తెలిసిందే. గతంలో మత ఘర్షణలు జరిగిన ప్రాంతాలున్న రాష్ట్రం మనది. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న జనజీవనంలో తమ గెలుపు కోసం బీజేపీ మత చిచ్చు పెట్టేందుకు సిద్ధపడుతున్నది. రాష్ట్రంలో ఏమాత్రం బీజేపీ బలపడినా, రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రయోజనాలకూ హాని జరుగుతుంది. అందుకే వారు ఏ ఒక్క స్థానంలోనూ గెలవ కుండా చూడటం అవసరం. సీట్లే కాదు… ఓట్లు పడినా ప్రమా దమే. ఇప్పుడు తమ పార్టీ గెలవదని వారికి కూడా తెలుసు. అందుకే ఈ శాసనసభ ఎన్నికల్లో ఓట్లు చూపి, తర్వాత జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేయాలనుకుం టున్నారు. అది దేశ ప్రయోజనాలకు కూడా హానికరమే!
దేశంలో బీజేపీ, మతోన్మాదాన్ని ఓడించాలన్నది వామప క్షాల ప్రధాన లక్ష్యం. ఇది అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో కూడా బీజేపీ బలపడకుండా చూడాలన్న లక్ష్యంతోనే బీఆర్‌ఎస్‌తో సర్దుబాట్లకు ప్రయత్నించాయి. బీఆర్‌ఎస్‌ అవకాశవాద, ఏకపక్ష ధోరణితో సాధ్యపడలేదు. తర్వాత కాంగ్రెస్‌ అఖిలభారత నాయ కత్వం కోరినమేరకు కాంగ్రెసుతో సర్దుబాట్లకు సిద్ధపడ్డాయి. కానీ చివరినిమిషం దాకా తేలకుండా నాన్చింది. తామే అంగీక రించిన వాటి నుంచి వెనక్కిపోయింది. సీపీఐ, సీపీఐ(ఎం)లను ఒక్కొక్క సీటుకు పరిమితం చేయాలని ప్రయత్నించింది. అందువల్ల సీపీఐ(ఎం) ఒంటరి పోరుకు సిద్ధపడింది. ఈ పరిస్థి తుల్లో తెలంగాణ ప్రజలు రాష్ట్ర శాసనసభకు కమ్యూనిస్టు ప్రతిని ధులను పంపించడం ఎంతైనా అవసరం. సీపీఐ(ఎం) పోటీ చేస్తున్న స్థానాల్లో ఆ పార్టీని గెలిపించడం రాష్ట్ర ప్రయోజనా లకు అవసరం. అదే సమయంలో మతోన్మాద బీజేపీని, దాని మిత్రపక్షమైన జనసేన అభ్యర్థులను తెలంగాణ ప్రజలు తిర స్కరించాలి. ఇందుకోసం సీపీఐ(ఎం) పోటీచేయని మిగిలిన స్థానాలలో వామపక్ష, ప్రజాతంత్ర, సామాజిక, లౌకిక పోరాట శక్తులను గెలిపించాలి. ఇది తెలంగాణ భవిష్యత్తుకు కీలకమైన అంశం.
ఎస్‌ వీరయ్య

Spread the love