లంబోదర లకుమికర…

Lambodara Lakumikara...”లంబోదర లకుమికర/ అంబాసుత అమర వినుత” ఈ పాట లేకుండా వినాయక చవితి జరుగదు. పాడేవాళ్ళలో సగం మందికి అది రాసింది పురంధరదాసు అని తెలియదు. చిన్నప్పుడు ఆ లకుమికర అన్న పదం తెలియక, అర్థం కాక, లడ్డు మెక్కరా అని పాడుకుంటూ ఉంటే పెద్దోళ్ళు అరుస్తుంటే ఆ వినాయకచవితే వేరు. ఆ రోజు రాత్రి బయటకు రావాలంటే భయం, చంద్రుడు ఎక్కడ కనబడతాడో, మనం చూస్తామేమో అని. రాజ్యాంగ సవరణలు ఉన్నట్టే, ప్రతి దానికి ఒక పరిష్కారం పెట్టారు. చవితి చంద్రుడిని చూస్తే నీలాపనిందలు కలగకుండ శమంతకమణి చుట్టూ తిరిగే కథను వింటే ఇక దోషం ఉండదట. ఆ విషయం తెలిశాక డైరెక్టుగానే చూసేవాళ్ళం చంద్రుడిని. ఇప్పుడు డైరెక్టుగా చంద్రుడి మీదికి చంద్రయానునే పంపాము. ఆ కథ వింటే చాలు పాపాలన్నీ పోతాయి అని ఎవరైనా చెప్పుచ్చు. అయితే ఆ కథలో ఇస్రోను నెలకొల్పిన నెహ్రూ పేరు రాకూడదు అని ఒక కండిషనూ ఉండొచ్చు. ఏమైనా కండిషన్‌డ్‌ బెయిలు కూడా దొరకని గడ్డు రోజుల్లో ఉన్నాము. చంద్రుడైనా సరే ఏమీ చేయలేని పరిస్థితి. లంబోదర లకుమికర పాటలో నమో నమో అని కూడా వస్తుంది. దాన్ని ఆసరా చెసుకొని వినాయక చవితి సందర్భంగా దేశంలోని అన్ని పాఠశాలల్లో, కాలేజీల్లో ఒకటేమిటి కరోన సమయంలో వాయించిన గంటల్లాగా, పంద్రాగస్టుకు ఎగరేసిన జండాలాగా, ఈ నమో నమో ఓ మోత మోగించి ఉంటే ఎంత బాగుండేది అన్న ఆలోచన రాలేదేమో నాయకులకు.
లంబోదరుడు అంటే పెద్ద పొట్ట కలవాడు అంటే వినాయకుడు అని ఆ పాటలోని అర్థం. అయితే అలాంటి పొట్ట పెట్టుకున్న నాయకులే ఒక తరం ముందు ఎక్కువగా కనిపించేవాళ్లు. ఇప్పుడు బీపీలు, మధుమేహాలు ఎక్కువవుతున్నాయని నాయకులు కూడా నాజూగ్గా తయారవుతున్నారు. స్లిమ్‌ ఫిట్‌ బట్టల్లో ఒదిగిపోతున్నారు. మామూలు ప్యాంటు, షర్టు వేసుకున్న ముఖ్యమంత్రుల్నీ చూస్తున్నాం. తమదైన స్టయిల్లో ఖరీదైన బట్టలు, అద్దాలు, చెప్పులు ఇలా అన్నీ వేసుకుంటున్న నిరాడంబరులనూ చూస్తున్నాం, అతి నిరాడంబరులనూ చూస్తున్నాం. అసలు మనుషులకు ఈ పొట్ట ఎలా పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది అని ఆలోచిస్తే తిండి ఎక్కువై, ఆ ఎక్కువగా తీసుకున్న ఆహారం కొవ్వు రూపంలో పొట్టలో స్థలాన్ని ఆక్రమిస్తుంది. మానవ పరిణామ దశలో అందరూ సమంగా కష్టపడి సమంగా తిన్నప్పుడు అందరి బొజ్జలూ సాపుగా ఉండేవి. తరువాత కాలంలో మిగులు ఏర్పడ్డాక కొందరు కూచొని తింటూ ఇతరులతో పనిచేయించడం మొదలు పెట్టినాక ఈ బొజ్జ అనేది పెరగడం మొదలు పెట్టిందని గమనించాలి.
భూలోకం ఎలా ఉందోనని చూసి రమ్మంటే బ్రహ్మచారి అయిన వినాయకుడు బయలుదేరి బాగా పూజలు చేయించుకొని నిమజ్జనమయ్యాక మళ్ళీ కైలాసం చేరుకొని శివుడికి, పార్వతికి రిపోర్టు ఇస్తాడు భూలోకంలో అంతా బాగున్నారని. ఈ ఫార్ములాను పట్టుకొని ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కొందరు దేశమంతా తిరిగి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకోడానికి బయలుదేరతారు. వాళ్ళు బ్రహ్మచారులు కావచ్చు, కాకపోవచ్చు అది వేరే సంగతి. అయితే అధికారంలో ఉన్నవాళ్ళు ఈ పాద యాత్రలు చేయరెందుకు అన్న అనుమానం రావచ్చు. అదీ చెప్పుకుందాం. అధికారంలో ఉన్న నాయకులు తమ పాలనలో అంతా చల్లగా ఉన్నారని, తాము ప్రవేశపెట్టిన పథకాల వల్ల ప్రజలు చాలా సుభిక్షంగా ఉన్నారని తమ రిపోర్టులు తామే ఇచ్చుకుంటూ ఉంటారు కాబట్టి ఆ పనిపై తిరుగుతూ ఉంటారు. అయితే ఆ తిరుగుడు మంచి మంచి వాహనాల్లో, హెలికాప్టర్లలో ఉంటుంది. అంతే తేడా, మిగతాదంతా…
మా మిత్రుడు తనకు కొరుకుడు పడని విషయమొకటుందని చెబుతూ కొందరికి బొజ్జ పెరుగుతుంది కొందరికి పెరగదు ఎందుకు అన్న ప్రశ్నవేశాడు. ఇంకో మిత్రుడు బాగా కొరుకుడు పడితే ఇంకా బాగా తిన్నాడని అర్థం, అటువంటి వాళ్ళకు బొజ్జ పడుతుంది, అని ప్రశ్నలోనుండే జవాబుని లాగాడు. నిజంగానే ఇది కొరుకుడు పడని విషయంగా అనిపించినా బాగా ఆలోచిస్తే కరెక్టే అనిపించింది. ఉన్నవాడికి తింటే అరగదు, లేనివాడికి తిండే దొరకదు అని సినారె గారు ఎప్పుడో రాశారు. హెచ్చుతగ్గులు తొలగేరోజు ఎప్పుడొస్తుందో ఏమో అనీ అంటారాయన. రిక్షా తొక్కేవాడికి పొట్టే ఉండదు, అందులో ఎక్కి తిరిగేవాడికి బాన పొట్ట, ఇంట్లో సైకిలు తొక్కుతాడు, ఇది పూర్వపు పరిస్థితి. ఇప్పుడు ఆ రిక్షాలు లేవు కాని కష్టపడేవాళ్ళు వేరే విధాలుగా కష్టపడుతూనే ఉన్నారు. ఏమైనా ఈ బొజ్జ అనేది సుఖానికి, అనారోగ్యానికి గుర్తుగా భావించాలి. తిష్టజీవి సాపాటు కష్టజీవికి గ్రహపాటు అని ఇంకో కవి రాశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బొజ్జలున్నోళ్ళంతా కక్షగట్టే అవకాశముంది. అందుకే వాళ్ళకు ఓ సూచన, ఇకనైనా దాన్ని తగ్గించుకొండి అని.
ఈ వినాయక చవితి సమయంలో స్వామివారికి రకరకాల నైవేద్యాలు పెడతారు. తరువాత ప్రసాదంగా తామే తిని బ్రేవ్‌మని త్రేనుస్తారు. స్వామి తిననే తినడు. కోతులు లాంటివి రాకుండా స్వామి దగ్గర కాపలా కూడా ఉంటారు. అందుకే లేటెస్టు వినాయకుడు తన ముందు అన్నీ పెట్టి మళ్ళీ తామే తినేశారు అని రిపోర్టివ్వాలి పేరెంట్సుకి. భూలోకంలో ఏమైనా స్కిల్స్‌ నేర్చుకొచ్చావా? అని వాళ్ళడిగితే, తనకు నారదుడు ఎదురై భూలోకంలో నీకు స్కిల్సు నేర్పుతామని ఎవరైనా చెబితే వద్దు అని సూటిగా అనమన్నాడని గుర్తు చేశాడు లంబోదరుడు. వద్దులే నాన్నా ఆ భూలోకంలో నీవు స్కిల్సు నేర్చుకుని తరువాత కష్టాలు పడుతుంటే మేము మారువేషాలతో వచ్చి చూడటం అంత బాగుండదు, అయినా అక్కడ ఎవరికీ ఎటువంటి స్కీముల గురించి చెప్పడం లాంటిది చేయలేదు కదా! అవే తరువాత స్కాములుగా మారతాయి అన్న అమ్మ ప్రశ్నలకు బ్రేకు వేసి ఆకలవుతుంది ఏదైనా పెట్టమ్మా అన్నాడు వినాయకుడు. నేను భూలోకంలో ఎవ్వరితోనూ ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదులే భయపడొద్దు అన్నాడు వినాయకుడు. శివుడు ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. తనకు ప్లాస్టిక్‌ సర్జనుగా భూలోకంలో పేరు రావడం వెనుక ఎన్ని స్కీములు దాగున్నాయో అనీ అనుకున్నాడు లోలోపల.
జంధ్యాల రఘుబాబు
9849753298

Spread the love