– జవహర్ స్కూల్ దే పైచేయి
– నాలుగు ప్రయివేట్ పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత
– 129 మందికి 129 మంది పాస్
– ప్రయివేట్ విభాగంలో జవహర్ స్కూల్ విద్యార్థిని కాత్యాయని టాపర్
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రయివేట్ పాఠశాలలంటేనే పోటీ ఆ పోటీ కేవలం ఫలితాల పరంగానే కాకుండా నాణ్యమైన బోధన, మెరుగైన ప్రతిభ, విద్యార్థుల సాధనలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. అశ్వారావుపేట మండలంలోని నాలుగు ప్రయివేట్ పాఠశాలలు ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించి తమ ప్రతిభను చాటుకున్నాయి. మండలంలోని గుడ్ న్యూస్ స్కూల్, జవహర్ స్కూల్, గౌతమి స్కూల్, సూర్య స్కూల్‌ల నుంచి పరీక్షలకు హాజరైన మొత్తం 129 మంది విద్యార్థులు 129 మంది ఉత్తీర్ణత సాధించడం విశేషం. అన్ని పాఠశాలలు 100 శాతం ఫలితాలు నమోదు చేయడంతో ప్రైవేట్ పాఠశాలల మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొన్నట్లు స్పష్టమవుతోంది.
ఈ ఫలితాల్లో బాలికలే ఆధిపత్యం చాటారు. మొత్తం నాలుగు పాఠశాలల నుంచి ఐదుగురు విద్యార్థులు 550కు పైగా మార్కులు సాధించి ప్రత్యేక ప్రతిభ కనబరిచారు. వీరిలో జవహర్ స్కూల్ విద్యార్థిని ఎం. కాత్యాయని 600 మార్కులకు గాను 574 మార్కులు సాధించి ప్రైవేట్ పాఠశాలల విభాగంలో టాపర్‌గా నిలిచింది. అదే పాఠశాలకు చెందిన టి. హాసిని 569 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచింది. గౌతమి స్కూల్ విద్యార్థిని ఈ. భవ్యశ్రీ 562 మార్కులు, గుడ్ న్యూస్ స్కూల్ విద్యార్థి కె. ప్రశాంత్ 553 మార్కులు, సూర్య స్కూల్ విద్యార్థిని ఎస్‌కే షమీనా 551 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు.
పాఠశాలల వారీగా గుడ్ న్యూస్ స్కూల్ నుంచి 17 మంది, జవహర్ స్కూల్ నుంచి 46 మంది, గౌతమి స్కూల్ నుంచి 22 మంది, సూర్య స్కూల్ నుంచి 44 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై అందరూ ఉత్తీర్ణులయ్యారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయా పాఠశాలల నిర్వాహకులు ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్, మైథిలి,చలపతిరావు,కే.లక్ష్మి, టెన్సీ, పోతన రాంబాబు,మల్లికార్జున్ రావు లు అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఆకాంక్షించారు.


