విద్యుత్‌రంగ ప్రయివేటీకరణకు కాంగ్రెస్‌ కుట్ర

విద్యుత్‌రంగ ప్రయివేటీకరణకు కాంగ్రెస్‌ కుట్ర– మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో విద్యుత్‌రంగాన్ని ప్రయివేటీకరించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని మాజీ విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి మీడియాకు లీకులు ఇస్తున్నారనీ, ఆ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క దీనిపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. పాతబస్తీలో కరెంటు బిల్లు వసూళ్లను అదానీకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఆదివారంనాడిక్కడి తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయివేటు వ్యక్తులు విద్యుత్‌ బిల్లులు వసూలు చేసేందుకు పైలెట్‌ ప్రాజెక్టుగా పాతబస్తీని ఎంచుకున్నారనీ, అది అక్కడికే పరిమితం కాదనీ, క్రమేణా రాష్ట్రం మొత్తం విద్యుత్‌ బిల్లుల వసూళ్లు ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోడీ చెప్పినట్టు చేస్తున్నారనీ, విద్యుత్‌ సంస్కరణల అమలుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కేంద్రం ఎన్ని వత్తిళ్లు తెచ్చినా, విద్యుత్‌ సంస్కరణలు అమలు చేసేది లేదని మాజీ సీఎం కే చంద్రశేఖరరావు అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తుచేశారు. ఈ సంస్కరణలు అమలైతే విద్యుత్‌ సబ్సిడీలు, రైతులకు ఉచిత కరెంటు వంటివి ఉండబోవనీ, మోటార్లకు మీటర్లు పెడతారని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ, అదానీ విధానాలను రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్‌ సంస్థ ప్రజల ఆస్తి. దీన్ని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పచెప్తున్నారు. హైదరాబాద్‌ పాతబస్తీలో 45 శాతమే కరెంటు బిల్లులు వసూలు అవుతున్నాయనీ, అందుకే ప్రయివేటు వ్యక్తులకు ఇస్తున్నామని సీఎం చెప్తున్నారనీ, రాష్ట్రం మొత్తంలో 95 నుంచి 97 శాతంకరెంటు బిల్లులు వసూలు అవుతున్నాయని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం పాతబస్తీ ప్రజల్ని అవమానించడమేనని అన్నారు. సింగరేణి బొగ్గు గనులను వేలం వేస్తుంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ కార్యక్రమంలో పాల్గొన్నారనీ, శ్రావణపల్లి బొగ్గు గనిని వేలం నుంచి ఎందుకు తీసివేయించలేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ వేలంలో పాల్గొనలేదని గుర్తు చేశారు. విద్యుత్‌ బిల్లుల వసూళ్లపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలన్నారు. తెలిపాలని డిమాండ్‌ చేశారు.

Spread the love