బ్రోకర్‌ పార్టీగా మారిన కాంగ్రెస్‌

– పాల్వాయి స్రవంతి
– రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన
నవతెలంగాణ – బంజారాహిల్స్‌
కాంగ్రెస్‌ బ్రోకర్‌ పార్టీగా మారిందని మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె, మునుగోడు నాయకురాలు పాల్వాయి స్రవంతి అన్నారు. శనివారం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఆమె హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో భావోద్వేగంతో మాట్లాడారు.
తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి పంపించానని చెప్పారు. పార్టీని వీడేందుకు దారితీసిన పరిస్థితులు, నాయకత్వం తీరుపై ఆ లేఖలో వివరించానని తెలిపారు. తన తండ్రి గోవర్ధన్‌రెడ్డి 60 ఏండ్లపాటు కాంగ్రెస్‌లో ఉన్నారని.. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ కార్పొరేట్‌ పార్టీగా మారిందని ఆరోపించారు. పార్టీని వీడాల్సి రావడం తనకు బాధగానే ఉందన్నారు.
కాంగ్రెస్‌ను విడిచి వెళ్లిన రాజగోపాల్‌రెడ్డి తిరిగి వస్తే మళ్లీ కండువా కప్పి 24 గంటల్లోనే మునుగోడు టిక్కెట్‌ కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్న తనకు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదన్నారు. పీసీసీ అధ్యక్షుడి స్థానంలో ఉన్న వ్యక్తి అన్నీ తుంగలో తొక్కారన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో విలువలు లేవన్నారు. కొందరి కుటిల రాజకీయాల వల్ల పార్టీ మనుగడ ప్రశ్నర్థకంగా మారుతోందని చెప్పారు. మతతత్వ పార్టీలోకి వెళ్లనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రజల పక్షాన నిలబడేది బీఆర్‌ఎస్‌ అని భావిస్తున్నానన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి తమ ఇంటికి వచ్చి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారని.. దీనిపై రేపో, మాపో నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు.

Spread the love