– మూడు శాఖల సీఎంగా రేవంత్ రెడ్డి, మూడు శాఖల మంత్రులు బట్టి, పొంగులేటి, తుమ్మల పాలనలో విఫలం
– స్కాంల ప్రభుత్వాన్ని గద్దె దింపి స్కీముల ప్రభుత్వాన్ని తీసుకురావాలి
– రాబోయే ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే
– బీఆర్ఎస్ శాసన సభ పక్ష నేత హరీష్ రావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై అవగాహన సదస్సు మంగళవారం అశ్వారావుపేట లోని శ్రీ శ్రీ కళ్యాణ మండపంలో నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి ఉప్పల వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత తన్నీరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటూ ఎదురుచూస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఎన్నికల హామీల్లో లేకపోయినా పేద ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి రూ.13 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి 13 లక్షల మందికి పైగా లబ్ధి చేకూర్చారని పేర్కొన్నారు. కరోనా సమయంలో కూడా ఏ సంక్షేమ పథకాన్ని నిలిపివేయకుండా రైతుబంధు ద్వారా రైతులకు రూ.73 వేల కోట్ల సహాయం అందించారని తెలిపారు.
2024 ఎన్నికల్లో కృతజ్ఞత కంటే ఆశ గెలిచిందని, అందువల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు అమలులో విఫలమైందని, రైతులకు వేల కోట్ల రూపాయలు బకాయి పడిందని ఆరోపించారు. పంటల బీమా, పంట నష్టపరిహారం, యూరియా సరఫరా వంటి అంశాల్లో ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదని విమర్శించారు.
ఉచిత విద్యుత్ వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కేసీఆర్ హయాంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించగా ప్రస్తుతం రైతుల్లో ఆందోళన నెలకొందని అన్నారు. గిరిజనులు, ఎస్సీలు, బీసీల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టగా, ప్రస్తుత ప్రభుత్వం కేటాయించిన నిధులను కూడా విడుదల చేయలేదని ఆరోపించారు.
ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ జిల్లాకు చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదని విమర్శించారు. సీతారామ ప్రాజెక్టు, అశ్వారావుపేట 100 పడకల ఆసుపత్రి వంటి కీలక కార్యక్రమాలు కేసీఆర్ హయాంలోనే సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తోందని ఆరోపించిన హరీష్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు, మోసాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరో రెండేళ్లలో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, శాసనమండలి సభ్యులు తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే లు తాటి వెంకటేశ్వర్లు,రేగా కాంతారావు,మెచ్చా నాగేశ్వరరావు లు పాల్గొన్నారు.



