నవతెలంగాణ–కాటారం
కాటారం మండలంలోని నాస్తూరు పల్లి లో నిర్వహించిన ప్రజాపాలన సమావేశం అసలు లక్ష్యం అభివృద్ధి కాకుండా మాజీ సీఎం కేసీఆర్‌ను విమర్శించడమేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు. బుధవారం కాటారం మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన తీరు సమాజానికి అసహ్యంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి స్థాయికి తగిన విధంగా ప్రవర్తించకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.
ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలకు రూ.2500, రైతులకు రూ.15 వేల వంటి హామీలు ఎక్కడ అమలయ్యాయని ప్రశ్నించారు. కాళేశ్వరం పనికిరాదని చెప్పిన సీఎం అదే మార్గంలో కాన్వాయ్‌లో వెళ్లడం ఏమిటని నిలదీశారు.
కాటారం ప్రాంతానికి పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తీసుకురావాల్సిన సమయంలో రాజకీయ విమర్శలకే సమావేశాలు నిర్వహించడం బాధాకరమన్నారు. ప్రజలు ప్రభుత్వ హామీలను గమనిస్తున్నారని, భవిష్యత్తులో తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో భారీ సంఖ్య లో బీ ఆర్ ఎస్ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.



