పెద్దపల్లిలో కాంగ్రెస్‌ విజయం

పెద్దపల్లిలో కాంగ్రెస్‌ విజయం– వంశీ గెలుపును భుజాన వేసుకున్న దుద్దిళ్ల
– ధర్మపురి మినహా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌కు మెజార్టీ
– శ్రీధర్‌బాబు ఇలాకాలోనే అత్యధికంగా 52957 ఓట్ల మెజార్టీ..
– ఫలించని బీఆర్‌ఎస్‌ క్రాస్‌ ఓటింగ్‌..
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయప్రతినిధి
పెద్దపల్లి పార్లమెంట్‌ స్థానం.. దీని పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే ఉండటం.. అసెంబ్లీలో అన్ని సీట్లలో 30వేలకు తగ్గకుండా మెజార్టీ సాధించడం వంటి పరిణామాలతో పార్లమెంట్‌ ఎన్నికల్లో తొలుత కాంగ్రెస్‌ విజయం సునాయాసమే అన్న వాతావరణం ఉంది. అయితే, ఆ పార్టీ అభ్యర్థిగా ఒకే కుటుంబానికి చెందిన మూడోతరం వ్యక్తి గడ్డం వంశీకృష్ణకు టిక్కెట్‌ ఇవ్వడం మొదలు ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు నామినేషన్‌ సమయం వరకూ కొనసాగాయి. అప్పటికే రెండుసార్లు అక్కడ గెలిచిన బీఆర్‌ఎస్‌.. క్షేత్రస్థాయి ప్రచారం చేపట్టడం వంటి పరిణామాల మధ్య కాంగ్రెస్‌ అధిష్టానం ఆ స్థానం గెలుపు బాధ్యతను మంథని ఎమ్మెల్యే మంత్రి శ్రీధర్‌బాబుకు అప్పగించింది. పార్టీలో ప్రతికూల పరిస్థితులను చక్కదిద్దుతూ తనదైన మార్క్‌తో ప్రచార బాధ్యతలు పరిశీలించిన ఆయన.. బీఆర్‌ఎస్‌ క్రాస్‌ ఓటింగ్‌కు సైతం చిక్కకుండా భారీ మెజార్టీతో వంశీ గెలుపును సునాయాసం చేయడంలో సఫలీకృతులయ్యారు.
పెద్దపల్లి పార్లమెంట్‌ స్థానం నుంచి గడ్డం వంశీ కృష్ణ 4,73,734 ఓట్లు సాధించి.. 1,30,863 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఒక్క ధర్మపురి మినహా అన్ని సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ అభ్యర్థి మెజార్టీ ఓట్లు సాధించారు. ధర్మపురిలో కాంగ్రెస్‌కు 56,938ఓట్లు రాగా, బీజేపీకి 65018 ఓట్లు రావడంతో.. అక్కడ బీజేపీకి మెజార్టీ వచ్చింది. అత్యల్పంగా పెద్దపల్లిలో 5325 ఓట్ల మెజార్టీ రాగా.. మంచిర్యాలలో 19457, బెల్లంపల్లిలో 24580, చెన్నూర్‌లో 24715, రామగుండంలో 10131 ఓట్లు వచ్చాయి. మంథని ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న శ్రీధర్‌బాబు ఇలాకాలో ఏకంగా 87079ఓట్లు రాగా.. 52957ఓట్ల మెజార్టీ రావడం గమనార్హం.
ఫలించని క్రాస్‌ ఓటింగ్‌..
పెద్దపల్లి సిట్టింగ్‌ సీటును బీఆర్‌ఎస్‌ కోల్పోయి మూడో స్థానానికి పరిమితమైంది. అయితే, 2014లో ఇదే పార్టీ నుంచి బాల్కసుమన్‌ ఎంపీగా గెలవగా.. 2019 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా వెంకటేష్‌ నేత విజయం సాధించారు. వరుసగా రెండుసార్లు గెలిచిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఈ ఎన్నికల్లో వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉన్న కొప్పుల ఈశ్వర్‌ను బరిలో దింపింది. ఎన్నికల ప్రారంభ సమయంలో కాంగ్రెస్‌లో ప్రతికూల పరిస్థితులు.. కొప్పుల ఈశ్వర్‌కు మంచి పట్టు ఉందన్న సర్వే అంచనాలు.. గెలుపు అవకాశాలు మళ్లీ బీఆర్‌ఎస్‌కే అన్న సంకేతాలు కనిపించాయి. తీరా పోలింగ్‌ సమయానికి చేతులెత్తేసిన బీఆర్‌ఎస్‌ ఇక్కడ కాంగ్రెస్‌ను ఎలాగైనా ఓడించాలని క్షేత్రస్థాయిలో బీజేపికి క్రాస్‌ ఓటింగ్‌ చేయించిందన్న విమర్శను మూటగట్టుకుంది. అందుకు అద్దం పట్టేలా 1,93,266ఓట్లు మాత్రమే పొందిన బీఆర్‌ఎస్‌ ఈ పార్లమెంట్‌ సెగ్మెంట్‌లో ఏమాత్రమూ పట్టుగానీ, పార్టీ కేడర్‌గానీ లేని బీజేపికి ఓట్లు బదలాయించి ఏకంగా కమలం అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌కు 3,42,871ఓట్లు వచ్చేలా చేసింది. అయినప్పటికీ కాంగ్రెస్‌ క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్‌ను అప్రమత్తం చేస్తూ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో ఎమ్మెల్యేలందరూ దృష్టిసారించి తమ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించుకోలిగారు.

Spread the love