వర్కర్స్‌ మ్యానిఫెస్టోను పరిగణనలోకి తీసుకోండి

– టీటీడీపీ, బీఎస్పీ, సీపీఐఎంల్‌(ప్రజాపంథా) పార్టీలకు కార్మిక సంఘాల వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణలోని కార్మిక, ఉద్యోగ సంఘాలు సంయుక్తంగా రూపొందించిన వర్కర్స్‌ మ్యానిఫెస్టోలో అంశాలను పరిగణనలోకి తీసుకోవాలనీ, కార్మికులకు మేలు చేసే అంశాలను పార్టీలు తమ మ్యానిఫెస్టోలో పొందుపర్చాలని కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌, సీపీఐఎంల్‌(ప్రజాపంథా) రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుకు వర్కర్స్‌ మ్యానిఫెస్టోను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.బాలరాజు, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌డీ.చంద్రశేఖర్‌, హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బా రామారావు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎంకే బోసు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ పాల్గొన్నారు. రాష్ట్రంలో పదేండ్లుగా కార్మికులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సమ్మెలు, ఉద్యమాలు చేపట్టినా రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలోనే కార్మికులకు సంబంధించిన పలు అంశాలతో వర్కర్స్‌ మ్యానిఫెస్టోను సంయుక్తంగా నిర్వహించామని తెలిపారు. రాష్ట్రంలో కోటి మందికి ప్రయోజనం కల్గించే 73 షెడ్యూల్డ్‌ ఎంప్లాయిమెంట్‌ కనీస వేతనాలను సవరించాలనీ, కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించాలని జరుగుతున్న పోరాటాలకు ఎల్లవేళలా అండగా ఉండాలనీ, ఈ డిమాండ్లను నెరవేరుస్తామని బీఎస్పీ, టీడీపీ, సీపీఐఎంఎల్‌(ప్రజాపంథా) పార్టీలు తమ మ్యానిఫెస్టోలో చేర్చాలని కోరారు.

Spread the love