చంద్రబాబు కుటుంబాన్ని చంపే కుట్ర

Conspiracy to kill Chandrababu's family– ఎపి సీఎం జగన్‌పై మోత్కుపల్లి ఫైర్‌
– ఎన్టీఆర్‌ ఘాట్‌లో దీక్ష
నవతెలంగాణ-హైదరాబాద్‌
చంద్రబాబు కుటుంబాన్ని చంపేందుకు ఏపీ సీఎం జగన్‌ ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేని వ్యక్తిని అరెస్ట్‌ చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చనిపోతే తనకు ఎదురుండదని జగన్‌ అనుకుంటున్నారని చెప్పారు. ఇంకోసారి జగన్‌ వస్తే ఆ రాష్ట్రం రావణకాష్టం అవుతుందని తెలిపారు. నీకు తల్లీ, చెల్లీ , ప్రజలు, ఎస్సీ, ఎస్టీలు అక్కర్లేదని అన్నారు. 15 ఏండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ఘాట్‌ వద్ద మోత్కుపల్లి అన అనుచరులతో కలిసి దీక్ష చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష కొనసాగింది. దీనికి టీడీపీ సీనియర్‌నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఇతర టీడీపీ శ్రేణులు సైతం పాల్గొని సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కిల్‌ డెవలప్‌మెంటు వ్యవహారంపై 2021లో కేసు నమోదైతే, నాలుగేండ్ల తర్వాత అరెస్టు చేయించిన ఘనత ఏపీ సీఎం జగన్‌దేనని విమర్శించారు. ‘జగన్‌..నిన్ను నీ విధానాలను చూసి ప్రజలు నవ్వుతున్నారు..వచ్చిన అధికారాన్ని కాపాడుకోలేని అసమర్ధుడివి..ప్రజలు నిన్ను చీత్కరిస్తున్నారు. నియంతగా పేరుతెచ్చుకున్నావు..చంద్రబాబును అరెస్టు చేసి ఏం ఆనందం పొందారో అర్థం కాలేదు..నారా భువనశ్వేరి ఏడుపు నీకు తగులుతుంది..ఎదుటివారిని ఇబ్బందిపెడితే నీకే నష్టం..రానున్న రోజుల్లో నాలుగు సీట్లు కూడా వైసీపీకి రావు..సొంత చెల్లికి తండ్రి ఆస్తిలో కూడా భాగం ఇవ్వకుండా బయటకు పంపారని’ వ్యాఖ్యానించారు. సొంత బాబారుని చంపిన నేరస్థుడిని పట్టుకోలేని జగన్‌ ఎలాంటి నాయకుడు ? నేను జగన్‌కు వ్యతిరేకం కాదు..ఆయన దుర్మార్గానికి వ్యతిరేకమని చెప్పారు. దీక్షలో సోమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టు సందర్భంగా ఏపీలో చోటుచేసుకున్న పరిణామాలను వివరించారు. ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, సీనియర్‌ నేత పరిగి చంద్రయ్య, అశోక్‌గౌడ్‌, శ్రీనివాస్‌కుమార్‌, సాయిబాబా, మహేందర్‌, గోపాల్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
‘కేసీఆర్‌ను నమ్మి మోసపోయా’
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును నమ్మి మోసపోయానంటూ మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ దగ్గర మీడియాతో మాట్లాడుతూ కేసీఆరే నన్ను పిలిచారనీ, ఆయనే దూరం పెట్టారని అభిప్రాయపడ్డారు. ఆరు నెలలుగా అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా నన్ను అవమానించారని విమర్శించారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు దగ్గరకే సులభంగా వెళ్లగలిగానని గుర్తుచేశారు. కేసీఆర్‌ మాత్రం సమయం ఇవ్వడం లేదన్నారు. దళితుడు ఇంట్లోకి వస్తే ఆవు మూత్రంలో శుభ్రం చేసుకునే రకం కేసీఆర్‌ అని ఆరోపించారు. చంద్రబాబు ఆరెస్టుపై స్పందించాలని కోరారు. లేకపోతే బీఆర్‌ఎస్‌కే నష్టమని హితవు పలికారు. నా మద్దతు లేకుండా నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌, ఒక్కసీటు కూడా గెలవలేదని అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రాదని అన్నారు. రేవంత్‌రెడ్డి వల్లే తెలంగాణలో కాంగ్రెస్‌ బలపడిందన్నారు. 30 నియోజకవర్గాల్లో ఏపీ సెటీలర్లు గెలుపోటములను ప్రభావితం చేస్తారని చెప్పారు. రేవంత్‌రెడ్ది నాకు తమ్ముడనీ, ఆయనతో నాకు శత్రుత్వం లేదని చెప్పారు.
చంద్రబాబుకు మద్దతుగా నేడు  టీడీపీ శ్రేణుల మౌన ప్రదర్శన
నవతెలంగాణ-హైదరాబాద్‌
చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో మౌన ప్రదర్శన నిర్వహించాలని తెలుగుదేశం రాష్ట్ర శాఖ నిర్ణయించింది. ఈమేరకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సోమవారం ఉదయం 10 గంటలకు ట్యాంక్‌బండ్‌ వద్ద గల డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం నుంచి ఎన్టీఆర్‌ ఘాట్‌ వరకు ర్యాలీలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌తోపాటు పొలిట్‌బ్యూరో సభ్యులు, కేంద్ర, రాష్ట్ర కమిటీల నాయకులు హాజరుకానున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

Spread the love