– కమిషనర్లు, ఎస్పీలతో వర్క్‌షాప్‌లో డీజీపీ స్పష్టీకరణ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసిపడుతూ సైబర్ నేరాలపై నిరంతరం నిఘా వేయాల్సినవసరం ఉన్నదని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ అన్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యానా నగర కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఒకరోజు వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. డిజిటల్ వ్యవస్థ మొదలుకావటంతో సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగాయని ఆయన అన్నారు. సాంప్రదాయిక నేరాల స్థానంలో సైబర్ నేరాలు చొరబడటంతో మోసపోతున్న బాధితుల సంఖ్య కూడా పెరిగిపోతున్నదని ఆయన తెలిపారు. రోజులు గడుస్తున్నా కొద్దీ సైబర్ నేరాల రూపురేఖల్లో కూడా విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని అంజనీకుమార్ చెప్పారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ నేరాల పట్ల ఎప్పటికప్పుడు అవగాహనను పెంచుకొని వాటిని నిరోధించే సామర్థ్యాన్ని కూడా నేర పరిశోధకులు పెంచుకోవాల్సినవసరం ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా, తీవ్రవాదులను నిరోధించే గ్రేహౌండ్స్ విభాగం, ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేసే కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాల పనితీరు, వారి పరిధి కంటే సైబర్ సెక్యూరిటీ బ్యూరో పరిధి అత్యంత విస్తారమైందని ఆయన అన్నారు. సైబర్ నేరాలను పరిశోధించటానికి రాష్ట్రాలే గాక అంతర్జాతీయ స్థాయిలో కూడా పరిశోధనలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. రాష్ట్రానికి చెందిన గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీ, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాల పనితీరు ఇతర రాష్ట్రాల పోలీసులకు అనుసరణీయమైందనీ, ఆ స్థాయికి రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేరుకోవాల్సినవసరం ఉన్నదని ఆయన చెప్పారు.