– అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలి : ప్రొఫెసర్ కోదండరామ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అఖిలపక్షం ఇచ్చిన సడక్ బంద్‌పై నిర్బంధం విధించడం దురదృష్టకరమని టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ ఖండించారు. అరెస్టు చేసిన అఖిలపక్ష, విద్యార్థి, యువజన నాయకులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం సడక్ బంద్ నేపథ్యంలో ప్రొఫెసర్ కోదండరామ్‌ను హైదరాబాద్ లోని తార్నాకలో గృహ నిర్బంధం విధించారు. ఈ నేపథ్యంలో ఉదయం ఆరు గంటల నుంచే పోలీసులు అఖిలపక్ష నేతలు కోదండరామ్ ఇంటికి చేరుకోగా అక్కడే పోలీసులు ఆపివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, టీజేఎస్, బీయస్పీ, సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ ఎంఎల్ న్యూడెమెక్రసీ, సీపీఐ ఎంప్రజాపంథా, సీపీఐ ఎంఎల్ న్యూడెమెక్రసీల సడక్ బంద్‌కు పిలుపునిచ్చాయని గుర్తుచేశారు. అసమర్థ సీఎం కేసీఆర్ వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితి దాపురించిందని ఆయన విమర్శించారు. ఉద్యోగ పరీక్షలను సక్రమంగా నిర్వహించలేని టీయస్పీయస్సీని ఎందుకు రద్దు చేయడంలేదో, దోషులను ఎందుకు నిగ్గు తేల్చడం లేదో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అఖిల పక్ష నేతలు గోవర్థన్, అరుణ, చలపతి రావు,సర్దార్ వినోద్ కుమార్, సలీం పాషా, నర్సయ్య, శ్రీధర్, ఆశప్ప, మోహన్ రెడ్డి, తుల్జ రెడ్డి, అరున్ కుమార్, ఆంజనేయులు, రవి కంత్, శ్రీనివాస్, నరహరి, అంజి గౌడ్, రమణ పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొన్నారు.