నిరంతరం కరెంట్‌ ఇచ్చి పంట పొలాలను కాపాడాలి

– సబ్‌స్టేషన్‌ ఎదుట రైతుల ఆందోళన
నవతెలంగాణ-మిర్యాలగూడ
24 గంటలు కరెంటు ఇచ్చి పంట పొలాలను కాపాడాలని మండలంలోని ఉట్లపల్లి గ్రామ రైతులు బుధవారం సబ్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. గంటల తరబడి ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఉట్లపల్లి గ్రామంలో సుమారు 1000 ఎకరాల వరకు వరి నాట్లు వేశారని కరెంట్‌ సరఫరా సక్రమంగా ఆనందకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటలు నిరంతరం పొలాలకు కరెంటు అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదన్నారు. మా పొలాలకు కేవలం 10 గంటలు మాత్రమే కరెంటు వస్తుందని అది కూడా రెండు విడతల్లో ఇస్తున్నారని అడపా దడపా కరెంటు ఇవ్వడం వల్ల నీళ్లు పంట పొలాలకు కింది వరకు చేరుకోవడం లేదన్నారు. గోర్లు బావుల ద్వారా పంటలను సాగు చేసుకుంటే కరెంట్‌ సక్రమంగా రాక నీళ్లు అందక వరి పొలాలు ఎండిపోతున్నాయని చెప్పారు. మాకు అందాల్సిన కరెంటు యాద్గర్‌ పల్లి గ్రామానికి మళ్ళిస్తున్నారని ఆరోపించారు. 24 గంటలు నిరంతరం కరెంట్‌ అందించి మా పంట పొలాలను కాపాడాలని డిమాండ్‌ చేశారు. కరెంటు విషయంలో అడిగేందుకు వెళితే సబ్‌ స్టేషన్‌ వద్ద ఎవరు అందుబాటులో ఉండడం లేదన్నారు. నిరంతరం కరెంటు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి తక్కలపల్లి శ్రీనివాస్‌, ఎస్కే షాబు, పొట్ల శంకర్రావు, తూడి ప్రభాకర్‌రెడ్డి, నరసింహారావు, రెడ్ల కోటిరెడ్డి, పీన్నం బ్రహ్మచారి, ఆర్ట్‌ మన్యం, కొండల్‌రెడ్డి, కొండ సైదులు, పిచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love