– టీయూఎంహెచ్‌ఈయూ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న రెండో ఏఎన్‌ఎంలు, ఈసీఏఎన్‌ఎంలు, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఏఎన్‌ఎంలు, వైద్య విధాన పరిషత్ ఏఎన్‌ఎంలు, హెచ్‌ఆర్డీ ఏఎన్‌ఎంలు ఇతర అన్ని రకాల ఏఎన్‌ఎంలను యధావిధిగా రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (టీయూఎంహెచ్‌ఈయూ-సీఐటీయూ) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషన్‌ను సోమవారం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యాద నాయక్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యలో వైద్య ఆరోగ్యశాఖలోని కొంత మందిని రెగ్యులర్ చేయడం హర్షణీయమని అన్నారు. కానీ మెజార్టీ ఉద్యోగులను విస్మరించడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే అందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య రంగానికి బలమైన ఆయువు పట్టుగా ఉండి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలు రెండు దశాబ్దాలుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారని చెప్పారు. నేటికీ రెగ్యులర్ కాకపోవడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఏఎన్‌ఎంలు ఏకకాలంలో 36 రకాల రికార్డులు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో నమోదు చేస్తున్నారని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైద్య ఆరోగ్య పథకాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని అన్నారు. 23 ఏండ్లుగా పనిచేస్తున్న ఏఎన్‌ఎంలకు ఎనిమిది, తొమ్మిది, పదో పీఆర్సీల ప్రకారం బేసిక్‌పే ఇచ్చారని గుర్తు చేశారు. కానీ తెలంగాణలో తొలి పీఆర్సీ బేసిక్ పే ఇవ్వకుండా 30 శాతం వేతనాలను పెంచడం వల్ల ఏఎన్‌ఎంలు ప్రతినెలా రూ.ఐదు వేలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే బేసిక్ పే ప్రకారం వేతనాలు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ బకాయిలను వెంటనే ఇవ్వాలని కోరారు. రెండో ఏఎన్‌ఎంలు, ఈసీ ఏఎన్‌ఎంలు, అర్బన్ హెల్త్ సెంటర్ల ఏఎన్‌ఎంలు 23 ఏండ్లుగా పనిచేస్తున్నా కనీస వేతనాలు ఇవ్వకుండా, రెగ్యులర్ చేయకుండా ప్రభుత్వం మోసం చేస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే వారందరిని ఎలాంటి షరతులు లేకుండా, రాత పరీక్షను రద్దుచేసి యధావిధిగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్పందనను బట్టి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఫసియుద్దీన్, కోశాధికారి ఏ కవిత, వివిధ జిల్లాల నాయకులు డి కిరణ్మయి, కే సరోజ, పి మంజుల, సంపూర్ణ, నేహా, మమత, లక్ష్మి, దైవమని తదితరులు పాల్గొన్నారు.